నగరం నలుమూలలా ఐటీ విస్తరణ

6 Nov, 2020 01:54 IST|Sakshi
కరోనా అనంతరం ఐటీ పరిశ్రమల అవసరాలు అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో జయేశ్‌ రంజన్‌ తదితరులు

త్వరలో కొంపల్లి ఐటీ టవర్‌కు శంకుస్థాపన 

హైసియా వార్షిక సదస్సులో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ ఎగుమతుల్లో గత ఏడాది 18 శాతం వృద్ధిరేటు సాధించడం ద్వారా పెట్టుబడులకు హైదరాబాద్‌ అనుకూలమనే విషయాన్ని ప్రపంచానికి చెప్పగలిగామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) 28వ వార్షిక సదస్సు ‘హైసియా ఇన్నోవేషన్‌ సమ్మిట్‌ 2020’లో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హైసియా అధ్యక్షుడు భరణి కె ఆరోల్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించారు. ఐటీ గ్రిడ్‌ పాలసీలో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామని, గ్రిడ్‌ ఏరియాలో ఏర్పాటయ్యే చిన్న, మధ్య తరహా కంపెనీల(ఎస్‌ఎంఈ)కు అద్దెపై 30 శాతం రిబేటు ఇస్తామన్నారు. గ్రిడ్‌ ప్రాంతాల్లో 500 మంది కంటే ఎక్కువ మందితో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. కొంపల్లిలో వచ్చేవారం ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేస్తామని, ఇప్పటికే 200కుపైగా ఎస్‌ఎంఈలు ఆసక్తి చూపుతున్నాయని కేటీఆర్‌ వెల్లడించారు. 

సమస్యల పరిష్కారానికి సానుకూలం 
కోవిడ్‌ సమయంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించకుండా హైసియా వంటి సంఘాల సహకారంతో ఏర్పాటు చేసిన ‘లే ఆఫ్‌ రిడ్రెసల్‌ కమిటీ’ఫలితాన్నిచ్చిందని కేటీఆర్‌ వెల్లడించారు. ఐటీ డెవలపర్స్, రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం కొనసాగుతున్నా దీర్ఘకాలంలో ఐటీ ఆఫీసులు, క్యాంపస్‌ మనుగడ సాగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన ఆవిష్కరణల కోసం టిహబ్, నైపుణ్య శిక్షణ కోసం టాస్క్‌తో కలసి హైసియా పనిచేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కోవిడ్‌ కాలంలో, వరదల వేళ హైసియా, ఆమ్‌చామ్, టై, నాస్కామ్‌ వంటి ఐటీ సంఘాలు, ఐటీ కంపెనీలు విరాళాలతో ముందుకు రావడం హర్షణీయమన్నారు.  

ఐటీ కంపెనీలకు అవార్డులు 
హైసియా వార్షికోత్సవం సందర్భంగా వివిధ కేటగిరీల్లో పలు ఐటీ కంపెనీలకు కేటీఆర్‌ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఎంపిక చేసిన పది స్టార్టప్‌లకు ఏడాదిపాటు స్పాన్సర్‌షిప్‌ అందిస్తామని హైసియా ప్రకటించింది. 170 స్టార్టప్‌లు, 200 మంది ఐటీ పరిశ్రమల ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో ఎస్‌టీపీఐ డీజీ ఓంకార్‌ రాయ్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టెక్‌ మహీంద్ర సీఈవో ఎండీ సీపీ గుర్నానీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు