నష్టపోయిన పరిశ్రమలకు సీఎం రిలీఫ్ ఫండ్

25 Nov, 2020 13:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి సహాయనిధిని నగరంలో నష్టపోయిన చిన్న పరిశ్రమలకు కూడా అందిస్తామని ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏరో స్పేస్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫార్మా, ఐటీని హైదరాబాద్‌కి తీసుకొచ్చామని, హైదరాబాద్‌తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆయన బుధవారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని మారియెట్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ‘హుషార్ హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కోవిడ్ ప్రభావం అన్ని రంగలమీద పడిందని, నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చదవండి: (హైదరాబాద్‌నూ అమ్మేస్తారు : కేటీఆర్‌)

కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పధకం కింద ఎంత మందిని ఆదుకుందో తెలియదని ఎద్దేవా చేశారు. డీమానిటైజేషన్ వల్ల చిరు వ్యాపారులు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. గతంలో పవర్ లేక చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడేవారని, కరెంట్ కోసం ధర్నాలు కూడా చేశారని కానీ ఇప్పుడు పరిస్థితిని పూర్తిగా మార్చామన్నారు. తెలంగాణ వచ్చాక 24 గంటలు విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. సిటీలో తన చిన్నతనంలో నెలకోసారి అల్లర్లు జరిగేవని, స్కూల్స్, పరిశ్రమలు బంద్ చేయించేవారన్నారు. దాని వల్ల విద్యార్థులతో పాటు వ్యాపారులు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. 

ఇప్పుడు సిటీలో అల్లర్లు చెలరేగకుండా చూస్తున్నామని, శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామని చెప్పారు. హైదరాబాద్‌ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నామని, సిటీ శివారుల్లో కొత్తగా వస్తున్న టౌన్షిప్‌లకు రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఏరో స్పేస్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫార్మా, ఐటీ ని హైదరాబాద్‌కి తీసుకొచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నగరంలో అందుతున్న వైద్యం, విద్య, ఉద్యోగోవకాశాలను జిల్లాల్లోనూ కల్పిస్తున్నామని తెలిపారు.

జిల్లాల్లోనూ ఇన్వెస్ట్ చెయ్యాలని వ్యాపారవేత్తలను కోరుతున్నామని, ఆగ్రో ప్రొస్సేసింగ్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ ఉందన్నారు. పాడీ పరిశ్రమల్లో మనం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, వరి, పప్పు ధాన్యాలు బాగా పండుతున్నాయన్నారు. వివిధ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలను నెలకొల్పేలా చూస్తామని కేటీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, హ్యాండ్ క్రాఫ్ట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్‌ సంపత్ కుమార్ గుప్తా, పలువురు  వ్యాపారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా