కార్యకర్త కూతురుకు కేటీఆర్‌ సర్‌‘ప్రైజ్‌’

14 Mar, 2021 04:08 IST|Sakshi
కేటీఆర్‌ పంపించిన కేక్, బొమ్మతో పుట్టిన రోజు జరుపుకుంటున్న నబీలా

బర్త్‌డే గిఫ్ట్‌ పంపిన కేటీఆర్‌

కార్యకర్తల నిబద్ధతే టీఆర్‌ఎస్‌కు బలమని వ్యాఖ్య 

ఫోన్‌ ద్వారా చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ పట్ల ఓ కార్యకర్త చూపిన నిబద్ధతకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు చలించిపోయారు. కార్యకర్త కూతురు పుట్టినరోజు సందర్భంగా అనూహ్యకానుకను పంపి ఆశ్చర్యానికి గురిచేశారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఖాజా నవాజ్‌ హుస్సేన్‌ పార్టీ ఆదేశం మేరకు సుమారు 20 రోజులపాటు హైదరాబాద్‌లో ఉండి పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం జరుగుతున్న సమయంలోనే నవాజ్‌ హుస్సేన్‌ మామ మరణించాడు. మామ అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా ఆయన హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు. మరోవైపు తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన తన భార్యకు ఫోన్‌లో దైర్యం చెప్తూ హైదరాబాద్‌లో పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచార తీరుతెన్నులపై పార్టీ నేతలు, కార్యకర్తలతో శుక్రవారం కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న సమయంలో ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది.

యోగక్షేమాలు విచారిస్తున్న సమయంలో శనివారం తన కూతురు నబీలా మహమ్మద్‌ పుట్టినరోజు ఉందని నవాజ్‌ హుస్సేన్‌ చెప్పాడు. పార్టీపట్ల కార్యకర్త చూపిస్తున్న అభిమానానికి చలించిపోయిన కేటీఆర్‌ శనివారం స్థానిక నాయకుల ద్వారా నబీలాకు ట్యాబ్‌తోపాటు కేక్, కొన్ని బొమ్మలు పంపించారు. అంతటితో సరిపెట్టకుండా పాపకు స్వయంగా ఫోన్‌ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఏమైనా కావాలా.. అని చిన్నారిని అడగ్గా ‘ఏమీ వద్దు.. తెలంగాణ గెలిస్తే చాలు’అని సమాధానం ఇచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ పట్ల కార్యకర్తలకు ఉన్న నిబద్ధత, వారి కుటుంబానికి ఉన్న అనుబంధానికి ఈ ఘటన నిదర్శనమని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌కు కార్యకర్తల అంకితభావమే బలమని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, ఏ ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందని, కంటికి రెప్పలా చూసుకుంటామని అన్నారు. 

మరిన్ని వార్తలు