కేటీఆర్‌ ట్వీట్‌తో రెండేళ్ల చిన్నారికి పునర్జన్మ

26 Jun, 2021 11:17 IST|Sakshi
తల్లితో బేబి అక్షయ

‘సిటిజన్‌’లో రెండేళ్ల చిన్నారికి ఉచిత చికిత్స

కోలుకుంటున్న బాలిక

సాక్షి, శేరిలింగంపల్లి: ప్రాణాంతక నియోప్లాస్టిక్‌ వాపుతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారికి నల్లగండ్లలోని సిటిజన్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్‌ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌ వైద్యులు ఉచితంగా శస్త్ర చికిత్స చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్‌ రీజినల్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌ తెలిపిన ప్రకారం...బేబీ అక్షయ ఏడాదిన్నర కాలంగా మెడ వద్ద వాపుతో బాధపడుతోంది. చికిత్స కోసం తల్లిదండ్రులు ఇటీవల అమెరికన్‌ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌లోని రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ను సంప్రదించారు.

పరీక్షించిన ఆయన చిన్నారి మెడపై 8.5 సెంటి మీటర్ల విస్తర్ణంలో గడ్డ ఉందని, ఇది గుండె నుంచి మెదడు, ఇతర శరీర భాగాలకు రక్తం సరఫరాకు అడ్డంకిగా మారిందని గుర్తించారు. వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో తల్లిదండ్రులు తమ చిన్నారిని కాపాడాలని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. స్పందించి న ఆయన ఉచితంగా చిన్నారికి చికిత్స చేయాలని ఆసుపత్రిని కోరుతూ రీ ట్వీట్‌ చేశారు. దీంతో ఖరీదైన ఈ శస్త్ర చికిత్సను పైసా కూడా తీసుకోకుండా ఇటీవల చిన్నారి అక్షయకు  ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌ వైద్యులు చేశారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటోందని ప్రభాకర్‌  తెలిపారు.

చదవండి: సాక్షి, ఎఫెక్ట్‌: తొలగించిన డబ్బా మళ్లీ పెట్టించారు

మరిన్ని వార్తలు