కంటోన్మెంట్‌ విలీనంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ 

23 Sep, 2021 07:15 IST|Sakshi

సాక్షి, కంటోన్మెంట్‌(హైదరాబాద్‌): కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలిపేద్దామా? అంటూ ట్విటర్‌ వేదిక మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కంటోన్మెంట్‌లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ‘కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో కలపాలంటూ అక్కడి ప్రాంత ప్రజలు కోరుతున్నట్లు వార్త చూశా.. దీనికి నేను అంగీకరిస్తున్నా, మీరేమంటారు?’ అంటూ నెటిజన్‌లను ఆయన ప్రశ్నించారు.

దీంతో కంటోన్మెంట్‌లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపడమే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన కంటోన్మెంట్‌ వికాస్‌ మంచ్‌ ప్రతినిధులు తమ పోరాటానికి వెయ్యేనుగుల బలం వచ్చిందంటున్నారు. సాక్షాత్తూ మున్సిపల్‌ శాఖ మంత్రి తమ పోరాటానికి మద్దతు పలకడంతో సగం విజయం సాధించనట్లేనని అభిప్రాయపడుతున్నారు.

కంటోన్మెంట్‌ వికాస్‌ మంచ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం ఏబెల్, సంకి రవీందర్‌లు బుధవారం ఎమ్మెల్యే సాయన్నను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరారు. అదే సమయంలో మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపేందుకు ప్రయత్నించాలని ఎమ్మెల్యేను కోరారు. టీఆర్‌ఎస్‌ ఎంపీల ద్వారా పార్లమెంట్‌ సమావేశాల్లోనే జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ విలీనంపై చర్చ లేవనెత్తాలని కోరారు.  

మూడేళ్లుగా చర్చ 
కంటోన్మెంట్‌ బోర్డుల రద్దు అంశంపై మూడేళ్లుగా వార్తలు వెలువుడుతున్నాయి. తాగా గతేడాది కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్‌లను సమీప మున్సిపాలిటీలు/ కార్పొరేషన్‌లలో విలీనంపై అభిప్రాయం కోరినట్లు కూడా ప్రచారం జరిగింది. తాజాగా మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌తో కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్‌కు బలం చేకూరింది. కాగా ఈ అంశంపై తాను సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. 

చదవండి: TS High Court: ఎన్ని ప్రాణాలు పోవాలి?


    
 

మరిన్ని వార్తలు