KTR Tweets Video Viral: బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్‌ ఫిదా: ‘పేపర్‌ వేస్తే తప్పేంటి’

23 Sep, 2021 12:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాల్యం ప్రతి మనిషి జీవితంలో అందమైన జ్ఞాపకం. ఎంత వయసు వచ్చినా.. జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా.. బాల్య స్మృతులు తలుచుకోగానే మనసులో తెలియని ఆనందం. అవును మరి రేపటి గురించి దిగులు లేదు.. నేడు ఎలా గడుస్తుందో అన్న బెంగ లేదు. అమ్మనాన్నల ప్రేమ.. స్నేహితులతో ఆటలు.. బడిలో గెంతులు. బాల్యం అనగానే వినిపించే మాటలు. అయితే ఇది ఒకవైపు మాత్రమే. 

మరోవైపు.. పలకబలపం పట్టాల్సిన చిన్నారులు పనిలో తలమునకలవుతున్నారు. చిన్న తనంలోనే వారి మీద పెద్ద బాధ్యత. వెరసి మనచుట్టూ ఎందరో బాల కార్మికులు. కోవిడ్‌తో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇంట్లోని ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల. ఈ క్రమంలో కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని.. చదువుకుంటునే పని చేస్తున్న చిన్నారులెందరో ఉన్నారు. 
(చదవండి: కంటోన్మెంట్‌ విలీనంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ )

తాజాగా ఈ కోవకు చెందిన వీడియోని ఒకదాన్ని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది తెగవైరలవుతోంది. ఈ బుడ్డోడి ఆత్మవిశ్వాసానికి కేటీఆర్‌ సైతం ఫిదా అయ్యాడు. చిన్నారి భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నారు. ‘‘ఈ చిన్నారి ఆత్మవిశ్వాసం, ఆలోచనల్లో స్పష్టత, హావభావాలు నాకు చాలా నచ్చాయి’’ అనే క్యాప్షన్‌తో వీడియోని షేర్‌ చేశారు కేటీఆర్‌. 

ఈ వీడియోలోని సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న జై ప్రకాశ్‌ ఉదయం పూట పేపర్‌ బాయ్‌గా పని చేసుకుంటున్నాడు. ఇది గమనించి ఆ దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి.. జై ప్రకాశ్‌ని పలకరించాడు. ఏం చేస్తున్నావ్‌.. ఎక్కడ చదువుతున్నావ్‌ అని ప్రశ్నించాడు. అనంతరం సదరు వ్యక్తి ఈ ఏజ్‌లో నువ్వు పేపర్‌ వేస్తున్నావ్‌ ఎందుకు అని ప్రశ్నించగా.. అప్పుడు జై ప్రకాశ్‌ ‘ఏం.. పేపర్‌ వేయొద్దా’ అని తిరిగి ప్రశ్నిస్తాడు.
(చదవండి: కేటీఆర్‌పై ఆ విమర్శలు చేయొద్దు.. రేవంత్‌కు సిటీ సివిల్‌ కోర్టు ఆదేశం )

అప్పుడు ఆ వ్యక్తి చిన్నారి జై ప్రకాశ్‌ని ప్రశంసించి.. ‘చదువుకునే ఏజ్‌లో పని చేస్తున్నావ్‌ కదా’ అంటే.. అందుకు జై.. ‘చదువకుంటున్నా.. పని చేస్తున్నా.. దానిలో తప్పేం ఉంది’ అని తిరిగి ప్రశ్నిస్తాడు. ఈ ఏజ్‌లో నువ్వు ఇలా కష్టపడటం చాలా నచ్చింది అని సదరు వ్యక్తి అనగా.. ‘కష్టపడితే ఏం అయితది.. భవిష్యత్తులో నాకు మేలు చేస్తుంది’ అని సమాధానం ఇస్తాడు జై. ఇక వీడియో మొత్తంలో బుడ్డోడి ఎక్స్‌ప్రెషన్స్‌, కాన్ఫిడెన్స్‌ వేరే లెవల్‌.

ఈ వీడియో చూసిన నెటిజనులు చిన్నారి జైని ప్రశంసిస్తున్నారు. పిల్లలు, పెద్దలు నిన్ను చూసి నేర్చుకోవాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 5 వేల మందికి పైగా లైక్‌ చేయగా.. 900 మందికి పైగా రీట్వీట్‌ చేశారు. ఒక్కరోజులో చిన్నారి జై ప్రకాశ్‌ స్టార్‌ అయ్యాడు. 

చదవండి: శభాష్‌ పోలీస్‌.. నిండు ప్రాణాన్ని నిలిపిన కానిస్టేబుల్

మరిన్ని వార్తలు