యాదాద్రి పునర్నిర్మాణం కేసీఆర్‌ కలల ప్రాజెక్టు

25 Jan, 2021 02:25 IST|Sakshi
మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ వీడియోలోని చిత్రాలు 

ట్విట్టర్‌లో ఆలయ నిర్మాణంపై మంత్రి కేటీఆర్‌ వీడియో..  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అద్భుత ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్‌ కలల ప్రాజెక్టు అని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన ట్విట్టర్‌ వేదికగా యాదాద్రి ఆలయ వీడియోను పంచుకున్నారు. డ్రోన్‌ కెమెరా చిత్రీకరణతో కూడిన 1.10 నిమిషాల నిడివి గల ఈ వీడియో దేవాలయ కొత్త నిర్మాణాన్ని అద్భుతంగా చూపింది. చదవండి: (యాదాద్రి క్షేత్రం.. సొబగుల సోయగం)

ప్రధాన గోపుర ముఖద్వారాలు తెరుచుకుంటూ స్వామి మందిర సాక్షాత్కారంతో వీడియో ప్రారంభమవుతుంది. కృష్ణ శిలలతో ప్రాణం పోసుకున్న శిల్పాలు, పూర్తి రాతి నిర్మాణంగా మలిచిన తీరు, అడుగడుగునా అద్భుత నగిషీలు, గాలిగోపురం, మిగతా గోపురాలు, గుట్టపై ఆలయం పూర్తి రూపు, చుట్టూ పచ్చదనం.. ఇలా ఆ వీడియో యాదగిరీశుడు కొలువుదీరిన మందిరాన్ని కళ్లకు కట్టింది. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు లాంటి ఆధునిక దేవాలయాలు ఒకవైపు.. ప్రపంచ స్థాయి ఆధునిక ఆధ్యాత్మిక దేవాలయం యాదాద్రి పునర్నిర్మాణం మరోవైపు.. ముఖ్యమంత్రి విలక్షణ యోచనకు అభినందనలు అని కేటీఆర్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు