అన్ని వనరులున్నా ప్రోత్సాహమేదీ?

18 Jan, 2022 03:04 IST|Sakshi
పీఎం గతిశక్తి దక్షిణాది రాష్ట్రాల సదస్సులో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

తెలంగాణకు కేంద్రం నుంచి సరైన తోడ్పాటు కరువు 

ఎలాంటి అనుకూలతల్లేని బుందేల్‌ఖండ్‌కు డిఫెన్స్‌ కారిడార్‌ 

హైదరాబాద్‌కు మాత్రం మొండిచెయ్యి చూపారు 

పీఎం గతిశక్తి దక్షిణాది రాష్ట్రాల సదస్సులో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: భౌగోళిక వనరులతోపాటు అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన తోడ్పాటు అందడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్ష తన సోమవారం జరిగిన ‘పీఎం గతిశక్తి’దక్షిణాది రాష్ట్రాల వర్చువల్‌ సదస్సులో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. తయారీ, ఔషధ, చేనేత, వస్త్ర, విద్యుత్, బొగ్గు తదితర రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌లోనే 35 శాతం వాక్సిన్లు తయారవుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

హైదరాబాద్‌ దశాబ్దాలుగా రక్షణ రంగ సంస్థలకు చిరునామాగా ఉన్నా పక్కనపెట్టి.. ఎలాంటి అనుకూలతలు లేని బుందేల్‌ఖండ్‌కు కేంద్రం డిఫెన్స్‌ కారిడార్‌ను మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బుందేల్‌ఖండ్‌కు వెళ్లే విషయంలో అంతర్జాతీయ కంపెనీలు పునరాలోచనలో పడే అవకాశముందని పేర్కొన్నారు. చుట్టూ భూభాగంతో కూడిన తెలంగాణలో వస్తూత్పత్తులను ఓడరేవులకు తరలించేందుకు వీలుగా ప్రత్యేక కార్గో రైల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దానితోపాటు లాజిస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, రాష్ట్రంలో డ్రైపోర్టులు, సమీకృత మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌ అన్ని ప్రధాన ఓడరేవులకు రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నా.. రైళ్లు తక్కువగా ఉండటం సమస్యగా మారిందని, రైళ్లసంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. తరచూ ముందస్తు సమాచారం లేకుండా రైళ్లు రద్దవుతుండటంతో ఎగుమతిదారులు నష్టపోతున్నారని.. రోడ్డు మార్గాన తరలిం చాల్సి వస్తుండటంతో రవాణా వ్యయం పెరుగుతోందని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో అనేక లాజిస్టిక్‌ సౌకర్యాలు, పారిశ్రామిక క్లస్టర్లున్నా ‘నార్త్‌–సౌత్‌ ఫ్రై ట్‌ కారిడార్‌’తో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను ఆ కారిడార్‌తో అనుసంధానం చేస్తే బహుళ ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న ‘మేకిన్‌ ఇండియా’కేవలం ‘అసెంబ్లింగ్‌ ఇండియా’గా మారిందని.. ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో ఒక్క చిప్‌ కూడా తయారు కావ డం లేదని విమర్శించారు. ఈ రంగానికి కేంద్రం ఊతమివ్వాల్సిన అవసరముందని, ఎలక్ట్రానిక్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్ల ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతమని వివరించారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహిస్తే.. దేశ ఎగుమతుల లక్ష్యానికి అనుగుణంగా పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.   

మరిన్ని వార్తలు