విభేదాలు వీడి దేశాన్ని బాగు చేసుకుందాం..‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’లో కేటీఆర్‌  

22 May, 2022 01:50 IST|Sakshi
‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకుంటున్న ఎన్నారైలు

పెట్టుబడులతో దేశ, రాష్ట్ర అభివృద్ధికి ఊతమివ్వండి 

పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండి 

లండన్‌లో ప్రవాస భారతీయులతో ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’లో కేటీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: ‘విభేదాలను పక్కనబెట్టి అందరూ ఏకతాటిపైకి రావాలి. తెలంగాణతో పాటు దేశ అభివృద్ధి కోసం పనిచేసేందుకు మాతో కలిసి రావాలి’అని ప్రవాస భారతీయులకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని, పెట్టుబడులతో తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. సొంత రాష్ట్రంలో కంపెనీల ఏర్పాటు ద్వారా సంపద సృష్టించడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. యూకే పర్యటనలో భాగంగా శనివారం లండన్‌లో ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’లో కేటీఆర్‌ ప్రసంగించారు.

యూకే పర్యటనలో భాగంగా పలువురు విదేశీ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశాల ఫలితాలు త్వరలో కనిపిస్తాయని చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులు రప్పించడం, రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేయడమే తన ప్రథమ కర్తవ్యమని, యూకేతో భవిష్యత్తులో రాష్ట్ర సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ పెట్టుబడులతో ముందుకు రావాలని, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌లో ఐటీ టవర్లు ప్రారంభించామని చెప్పారు. త్వరలో మరిన్ని పట్టణాల్లోనూ ఐటీ పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వంతోనే పురోగతి సాధ్యమవుతుందని చెప్పారు. 

దేశ ఆర్థిక వ్యవస్థలో నాలుగో అతిపెద్ద రాష్ట్రం 
భారత ఆర్థిక వ్యవస్థకు కీలక స్తంభం తెలంగాణ అని కేటీఆర్‌ అన్నారు. స్టార్టప్‌ రాష్ట్రంగా ప్రస్థానం ప్రారంభించిన రాష్ట్రం.. తలసరి ఆదాయం, జీడీపీ వంటి అంశాల్లో కొత్త రికార్డును సృష్టించిందని, భారత ఆర్థిక వ్యవస్థలో నాలుగో అతిపెద్ద రాష్ట్రంగా నిలిచిందన్నారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ప్రస్థానాన్ని ప్రవాస తెలంగాణ వాసులు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. లండన్‌ కేంద్రంగా టీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తున్న పార్టీ ఎన్‌ఆర్‌ఐ లండన్‌ శాఖ అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం ఇంటికి కేటీఆర్‌ వెళ్లారు. బతుకమ్మ గురించి క్వీన్‌ ఎలిజబెత్‌కు వివరాలు తెలుపుతూ అనిల్‌ కూతురు నిత్య రాసిన లేఖకు క్వీన్‌ నుంచి వచ్చిన ప్రశంసను తెలుసుకున్న మంత్రి అభినందించారు. ప్రాంతం, దేశమేదైనా పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌ కుటుంబీకులేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర అవతరణ తర్వాత కూడా రాష్ట్రం సాధించిన విజయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంలో తెలంగాణ ప్రవాసులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారన్నారు.  

విద్యా సంస్థల్లో ఎలక్ట్రిక్‌ బస్సులు 
కాలుష్య నియంత్రణలో భాగంగా విద్యా సంస్థలు ఎలక్ట్రిక్‌ బస్సులను ఉపయోగించడాన్ని త్వరలో ప్రోత్సహిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రత్యేకించి వాణిజ్యపరంగా బస్సులు, వ్యాన్ల తయారీలో పేరొందిన ‘ఎరైవల్‌ యూకే’కార్యాలయాన్ని హైదరాబాద్‌కు చెందిన అల్లాక్స్‌ రిసోర్సెస్‌ సంస్థ ప్రతినిధులతో కలిసి కేటీఆర్‌ శనివారం సందర్శించారు. భారత్‌లో ప్రత్యేకించి తెలంగాణలో బస్సులు, ఇతర ఎలక్ట్రిక్‌ వాహనాల వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి ఎరైవల్‌ యూకేతో అల్లాక్స్‌ రిసోర్సెస్‌ చేతులు కలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రజా రవాణాలో భారత్‌లో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్‌ వాహనాలున్న రాష్ట్రంగా మారేందుకు ఎరైవల్‌ యూకే బస్సులు ఉపయోగపడుతాయన్నారు. కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. 
 

మరిన్ని వార్తలు