తెలంగాణలో పెట్టుబడులపై విశ్వవేదికగా ప్రసంగం

28 Oct, 2021 03:44 IST|Sakshi
బుధవారం పారిస్‌లో ఫ్రాన్స్‌ ‘డిజిటల్‌’ అంబాసిడర్‌ హెన్రీ వర్డియర్‌తో సమావేశమైన మంత్రి కేటీఆర్‌ చిత్రంలో పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు

పారిస్‌ పర్యటనకు మంత్రి కేటీఆర్‌

29న ‘యాంబిషన్‌ ఇండియా 2021’సదస్సులో కీలకోపన్యాసం

ఫ్రాన్స్‌ పెట్టుబడిదారులు,పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జరగనున్న వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొ నేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం బయలుదేరి వెళ్లింది. ఫ్రాన్స్‌ సెనేట్‌లో ఈనెల 29న జరిగే ‘యాంబిషన్‌ ఇండియా 2021’సదస్సులో మంత్రి కేటీఆర్‌ కీలకోపన్యాసం చేయనున్నారు. కోవిడ్‌ తదనంతర పరిస్థితుల్లో భారత్‌– ఫ్రాన్స్‌ సంబంధాలు అనే అంశంపై కేటీఆర్‌ ప్రసంగిస్తారు.

ఫ్రాన్స్‌ రాయబారి ఎమాన్యుయేల్‌ లెనైన్‌ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌.. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై విశ్వవేదికపై వివరిస్తారు. ఆరోగ్యరక్షణ, వాతావరణం, వ్యవ సాయం, వాణిజ్యం, డిజిటలైజేషన్‌ వంటి అంశా లపై జరిగే చర్చల్లో తెలంగాణ ప్రత్యేకతలను తెలియజేస్తారు. అలాగే ఫ్రాన్స్‌ పెట్టుబడిదారులు, సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో జరిగే సమా వేశాల్లో కేటీఆర్‌ పాల్గొంటారు.

భారత్, ఫ్రాన్స్‌ మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయేల్‌ మాక్రాన్‌ చొరవతో ‘యాంబిషన్‌ ఇండియా 2021’సదస్సును ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రతినిధి బృందంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు ఉన్నారు. 

తొలిరోజు పలు అంశాలపై చర్చ..
పారిస్‌ పర్యటన తొలిరోజున మంత్రి కేటీఆర్‌ ఫ్రాన్స్‌ ప్రభుత్వ డిజిటల్‌ వ్యవహారాల అంబాసిడర్‌ హెన్రీ వర్డియర్‌తో సమావేశమయ్యారు. ఇన్నో వేషన్, డిజిటైజేషన్, ఓపెన్‌ డేటా వంటి అంశాల్లో ఫ్రాన్స్, తెలంగాణ మధ్య పరస్పర సహకారంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో ఇన్నోవేషన్, అంకుర సంస్థలను ప్రోత్సహించ డానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, ఓపెన్‌ డేటా పాలసీ, డిజిటల్‌ రంగంలో రాష్ట్రంలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి మంత్రి కేటీఆర్, హెన్రీ వర్డియర్‌కు వివరించారు.

తెలంగాణలోని అంకుర సంస్థలకు ఫ్రాన్స్‌లో, ఫ్రాన్స్‌లోని అంకుర సంస్థలకు తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించడంపై కూడా విస్తృత చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఫ్రాన్స్‌లో భారత డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ కే.ఎం.ప్రఫుల్ల చంద్రశర్మ, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, డైరెక్టర్‌ డిజిటల్‌ మీడియా కొణతం దిలీప్, డైరెక్టర్‌ ఏవియేషన్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు