కేటీఆర్‌ జన్మదినానికి సర్‌ప్రైజ్‌: దివ్యాంగులకు ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’

22 Jul, 2021 21:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుక (జూలై 24) మంచి పనికి శ్రీకారం కానుంది. గతేడాది మాదిరి ఈ సంవత్సరం కూడా కేటీఆర్‌ జన్మదినాన్ని సమాజ సేవ కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నారు. గతేడాది ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ అనే కార్యక్రమంతో ప్రభుత్వ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు విరాళంగా అందించారు. ఆ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు వచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా అందించారు. 

ఈ ఏడాది తన జన్మదినాన్ని దివ్యాంగుల కోసం వినియోగించనున్నారు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ పేరుతో తాను వంద త్రిచక్ర వాహనాలను దివ్యాంగులకు అందించినున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అభిమానులు కూడా ఆ విధంగా చేయాలని పిలుపునిచ్చారు. బొకేలు, శాలువాలు, జ్ఞాపికలు, భారీ కేకులు వద్దంటూ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అయితే కేటీఆర్‌ పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే పలువురు త్రిచక్ర వాహనాలు సిద్ధం చేసుకున్నారని సమాచారం.

ఇప్పటివరకు అందిన సమాచారం వరకు

ఎమ్మెల్సీలు నవీన్‌ రావు వంద వాహనాలు, శంభీపూర్‌ రాజు 60 వాహనాలు, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి 60 వాహనాలు, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ 50 వాహనాలు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌ 50 వాహనాలు, గువ్వల బాలరాజు 20, గాదరి కిశోర్‌ 10 వాహనాలు అందించనున్నట్లు ప్రకటించారు. ఒక్కరోజే ఇంత పెద్ద స్థాయిలో స్పందన లభించింది. 24వ తేదీ వరకు భారీ స్థాయిలో స్పందన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. సంగీత దర్వకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామిని అవుతానని ప్రకటించారు. తోచినంత సహాయం చేస్తానని ట్విటర్‌లో తెలిపారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు