కూకట్‌పల్లి: యువతిని ఎరగా వేస్తారు, ఆశపడ్డావో అంతే!

11 Apr, 2021 09:34 IST|Sakshi
నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, కత్తి, ఆటో  

ఘరానా ముఠా ఆటకట్టించిన పోలీసులు 

కేపీహెచ్‌బీకాలనీ: యువతులను ఎరగా వేసి..యువకులను ఆకర్షించి దోపిడీలకు పాల్పడుతున్న 14 మంది ముఠా సభ్యుల్లో 8 మందిని కేపీహెచ్‌బీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద 13 సెల్‌ ఫోన్లు, ఒక కత్తి, ఆటోను స్వా«దీనం చేసుకున్నారు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్‌ వారసిగూడ ప్రాంతానికి చెందిన గంధం విశాల్, రామంతాపూర్‌కు చెందిన భాజిని నవీన్, రాము, ఉప్పల్‌ గణేశ్‌నగర్‌కు చెందిన శైలజ, చెరుకూరి స్వాతి, వికాస్, సికింద్రాబాద్‌ చిలకలగూడకు చెందిన గుండె నవీన్, బీరం మధు, సాయి, డబ్బా నవీన్, ఇర్ఫాన్, సయ్యద్‌ మరియ, జమిలి శివకుమార్, దుర్గలు ఓ ముఠాగా ఏర్పడ్డారు.

వీరు ముఠాలోని యువతులను యువకులపైకి ఎరవేసి ఆకర్షిస్తారు. అనంతరం అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 3వ తేదిన నవీన్‌ అనే వ్యక్తి..తనపై పలువురు దాడికి పాల్పడి గాయపర్చారంటూ కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించాడు. తమను ఫోటోలు తీశావంటూ నిందిస్తూ తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని నవీన్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇది జరిగిన మరుసటి రోజు 4వ తేదీన నిజాంపేట గ్రామానికి చెందిన కాసర్ల వేణు కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ రెస్టారెంట్‌ వద్దకు వచ్చాడు. అక్కడ టిఫిన్‌ పార్శిల్‌ చేయించుకొని తిరిగి వస్తుండగా అతని బైక్‌ని ఓ యువతి ఆపింది.
(చదవండి: హైదరాబాద్‌: వ్యాక్సిన్‌ వేసుకున్న కాసేపటికే కోమాలోకి)

ఆమె మాటలకు ఆకర్షితుడైన వేణు తన గదికి తీసుకువెళ్లేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన బైక్‌పై ఇంటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో హెచ్‌ఎంటీ శాతవాహన నగర్‌లోని ఓ ఏటీఎం సెంటర్‌ వద్ద డబ్బులు డ్రా చేసేందుకు ఆగాడు. ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లి బయటకు వచ్చేసరికి  గుర్తు తెలియని ఒక మహిళతో పాటు మరో నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి ఒక్కసారిగా వేణుపై దాడికి దిగారు. అతడిని తీవ్రంగా గాయపర్చి రెండు తులాల బంగారు గొలుసు, 4.5 గ్రాముల బంగారు ఉంగరాన్ని దోచుకెళ్లారు.

బాదితుడు వేణు వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ దృష్టికి వచి్చన రెండు కేసులకు సంబంధించి ఒకటే ముఠా చేసి ఉంటుందని అనుమానించారు. బాధితుడు వేణు నుంచి దాడికి పాల్పడిన వారి ఆనవాళ్లను సేకరించారు. అలాగే వారు వచి్చన ఆటో నెంబర్‌పై ఆరా తీయగా చివరి మూడు నెంబర్లు 258గా వేణు తెలిపాడు. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్‌ అండర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద వెళుతున్న ఆటోను ఆపి విచారించారు. ఆటోకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ గురించి అడగ్గా చూపించలేదు. దీంతో అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. వారి విచారణలో దోపిడీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. మొత్తం 14 మంది ముఠాలో విశాల్, బి.నవీన్, శైలజ, స్వాతి, నవీన్, మధు, సయ్యద్‌ మరియా, శివకుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రాము, వికాస్, సాయి, డబ్బా నవీన్, ఇర్ఫాన్, దుర్గల కోసం గాలిస్తున్నారు.  
(చదవండి: జర చూస్కో! మాస్కు లేకుంటే 1000 పడుద్ది)

మరిన్ని వార్తలు