కుమారి ఆంటీ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌!

3 Feb, 2024 20:26 IST|Sakshi

Kumari Aunty News: సోషల్‌ మీడియాతో వచ్చిన పాపులారిటీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదనే విషయం దాసరి సాయికుమారి అలియాస్‌ కుమారి ఆంటీకి బోధపడినట్లు ఉంది. ఫేమ్‌ కోసమో.. తన వ్యాపారం నడవాలనో.. లేక అమాయకత్వంతోనో అడ్డగోలుగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఎక్కడెక్కడి నుంచో జనం క్యూ కట్టడంతో.. ఆమె దుకాణం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తోందని, మరో చోటుకి తరలించాలని ట్రాఫిక్‌ పోలీసలు ఆదేశించడం వార్తలెక్కింది. 

అయితే.. ఈ విషయం అదే సోషల్‌ మీడియాలో మళ్లీ వైరల్‌ కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. కుమారి ఆంటీ వ్యాపారానికి ఇబ్బంది కలిగించవద్దని డీజీపీ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ వద్ద ఎక్కడైతే ఆమె స్ట్రీట్‌ఫుడ్‌ కోర్టు నడుస్తుందో.. అక్కడే నడిపించుకునేందుకు వీలు కల్పించారు. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆమె ఇంతలా పాపులర్‌ కావడానికి కారణమైన ‘ఎక్స్‌ట్రా టూ లివర్స్‌’ కస్టమర్‌తో సహా మళ్లీ కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈసారి ఆమె తన సంపాదనతో సోషల్‌ మీడియాలో ఇంకా నానుతూనే ఉంది. ఇది చాలదన్నట్లు..  త్వరలో ఆమె ఫుడ్‌కోర్టును సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా సందర్శిస్తారని ప్రచారం ఒకటి బయటకు వచ్చింది.

ఈ ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. సీఎం రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా జీవో 46 రద్దు చేయమని ఆయనతో చెప్పండి అంటూ నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టి తెగ ఇబ్బంది పెట్టారు.. పాపం. తనకు ఇవేవీ తెలియవని.. దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఆమె విజ్ఞప్తి చేయడం వీడియోలో చూడొచ్చు. అయితే.. వాళ్లలో కొందరు సీఎం రేవంత్ రెడ్డి మీ వద్దకు వచ్చినప్పుడు ఈ దరఖాస్తు ఇవ్వాలంటూ ఆమె చేతికి ఇవ్వబోయారు. ఈ ఘటనతో ఇప్పటికే మీ సమస్యను ఆయన(సీఎం రేవంత్‌) విని ఉంటారని చెబుతూ ఆమె ఆ దరఖాస్తును స్వీకరించేందుకు ఇష్టపడలేదు. పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జీవో 46 నుంచి టీఎస్‌ఎస్‌పీ పోస్టులను మినహాయించాలని గతంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో కాంగ్రెస్‌ కూడా నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే.

Video Credits: MD HAJI

ఇదీ చదవండి: సామాన్యులకు సోషల్‌ మీడియా వరమా? శాపమా?

whatsapp channel

మరిన్ని వార్తలు