కుమ్రం భీం జిల్లా: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. ఆదివాసీ సర్పంచ్‌ల మూకుమ్మడి రాజీనామా

27 Dec, 2022 16:33 IST|Sakshi
బీఆర్‌ఎస్‌ జెండా.. పక్కన ఎమ్మెల్యే ఆత్రం సక్కు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్‌): అధికార పార్టీకి చెందిన ఆదివాసీ సర్పంచ్‌లు రాజీనామా అస్త్రం సంధించారు. నిధుల్లేక గ్రామాల అభివృద్ధి అడుగు కూడా ముందుకు సాగడంలేదంటూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని 18 మంది సర్పంచ్‌లు బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సర్పంచ్‌లు సమావేశమై గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నామని, అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు.

ఆదివాసీ సర్పంచుల సంఘం మండల ప్రధానకార్యదర్శి సిడాం అన్నిగా విలేకరులతో మాట్లాడుతూ 2021 నుంచి నేటి వరకు ప్రభుత్వ విధానాలతోపంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సక్రమంగా అందడంలేదని, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తుగా చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్‌ బిల్లులు ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన గ్రామాల్లోని సమస్యలను పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు.

భూప్రక్షాళన తర్వాత చాలామంది రైతులకు కొత్తపట్టాలు రాలేదని, రేషన్‌కార్డులు ఇవ్వలేదని, డబుల్‌బెడ్రూం ఇళ్ల పంపిణీపై ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి వ్యవహారశైలి నచ్చక పార్టీని వీడుతున్నట్లు రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. రాజీనామా ప్రతులను వాట్సాప్‌ ద్వారా బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. రాజీనామా చేసినవారిలో ఆదివాసీ సర్పంచుల మండల అధ్యక్షుడు కోట్నాక కిష్టు, సర్పంచులు దేవ్‌రావు, పెందూర్‌ పవన్, జంగు, మనోహర్‌ తదితరులు ఉన్నారు.

గతంలోనూ రాజీనామా..
ఏడాది క్రితం మండలంలోని సర్పంచులు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మికి రాజీనామా పత్రాన్ని ఇచ్చేందుకు సైతం వెళ్లారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో రాజీనామా ఆలోచనను విరమించుకున్నారు. 

మరిన్ని వార్తలు