కువైట్‌ వెళ్లేవారికి కొత్త నిబంధన.. వలస కార్మికులు ఆవేదన

25 Jan, 2023 14:55 IST|Sakshi

కువైట్‌ కాన్సులేట్‌లో వీసాల పరిశీలన

నిబంధనలను మార్చిన ఆ దేశ విదేశాంగ శాఖ

కాలయాపన, ఆర్థికభారం అంటున్న వలసకార్మికులు

మోర్తాడ్‌(బాల్కొండ): మనదేశం నుంచి వెళ్లే వారికిగాను కువైట్‌ వీసా నిబంధనలను సవరించింది. కువైట్‌ నుంచి వీసాలు జారీ అయిన తరువాత అవి అసలువో నకిలీవో తేల్చడానికి ఆ దేశ కాన్సులేట్‌ల పరిశీలన కోసం పంపాల్సి ఉంది. ఈ కొత్త నిబంధన పదిహేను రోజుల కింద అమలులోకి వచ్చింది. వీసాలను కాన్సులేట్‌ పరిశీలన కోసం పంపడం వల్ల కాలయాపనతో పాటు ఆర్థికంగా భారం పడుతుందని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కువైట్‌లో ఉపాధి పొందాలనుకునే వారు లైసెన్స్‌డ్‌ ఏజెన్సీలు, లేదా తమకు తెలిసిన వారి ద్వారా వీసాలను పొందిన తరువాత పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ) తీసుకోవాల్సి ఉంటుంది. గల్ఫ్‌ దేశాల్లో ఒక్క కువైట్‌కు మాత్రమే పీసీసీ తప్పనిసరి అనే నిబంధన ఉంది. వీసా కాపీల పరిశీలనను ఇప్పుడు అదనంగా చేర్చారు. కువైట్‌ నుంచి వీసాలను ఆన్‌లైన్‌లోనే జారీ చేస్తున్నారు. ఈ వీసాలు అన్ని కువైట్‌ విదేశాంగ శాఖ ద్వారానే జారీ అవుతున్నాయి. విదేశాంగ శాఖ ఆమోదంతోనే వీసాలు జారీ కాగా, వాటిని మరోసారి తమ కాన్సులేట్‌ల్లో పరిశీలనకు పంపాలని కువైట్‌ ప్రభుత్వం సూచించడం అర్థరహితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఢిల్లీ, ముంబైలోనే కాన్సులేట్‌లు 
కువైట్‌ విదేశాంగ శాఖకు సంబంధించిన కాన్సు లేట్‌లు ఢిల్లీ, ముంబైలలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్‌కు భారీగానే వలసలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కాన్సులేట్‌ ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాల నుంచి వలస కార్మికులు కోరుతున్నారు. కువైట్‌ ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. కువైట్‌ ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లో తీసుకురావడంతో కాన్సులేట్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. (క్లిక్‌ చేయండి: లే ఆఫ్స్‌ దెబ్బకి భారత ఐటీ ఉద్యోగుల విలవిల)

మరిన్ని వార్తలు