దంపతుల హత్య: ఆ సమాచారం ఇచ్చింది లచ్చయ్య

21 Feb, 2021 03:51 IST|Sakshi
వామనరావు, నాగమణి దంపతులు (ఫైల్‌)

వామన్‌రావు కోర్టుకు వచ్చిన సంగతి కుంట శ్రీనుకు చేరవేత 

రిమాండ్‌ రిపోర్టులో పోలీసుల వెల్లడి 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  ‘గ్రామంలో కులపెద్దనైన నన్ను ఇబ్బంది పెట్టిండు. నా తమ్ముడైన సర్పంచితో నోటీసులు ఇప్పించిండు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించిండు. ఇన్ని అవమానాల పాలు చేసినందుకే వామన్‌రావును చంపాలని నిర్ణయించుకున్నా’అని న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పొందుపరిచినట్లు తెలిసింది. ‘వామన్‌రావు దంపతులు కోర్టుకు వచ్చిన విషయాన్ని లచ్చయ్య అనే వ్యక్తి కుంట శ్రీనివాస్‌కు చేరవేశాడు.

ఆ వెంటనే వామన్‌రావును హత్య చేసే విషయమై సహకరించాలని కుంట శ్రీను.. చిరంజీవిని, బిట్టు శ్రీనును కోరాడు. ఇందుకు వారు ఒప్పుకున్నారు. వామన్‌రావును ఎలాగైనా చంపాలని బిట్టు శ్రీను.. కుంట శ్రీనుకు చెప్పడంతోపాటు రెండు కత్తులు, కారు సమకూర్చాడు. అనంతరం బిట్టు శ్రీను సీన్‌లో నుంచి వెళ్లిపోయాడు. హత్య తర్వా త కుంట శ్రీను కారులో పరారవుతూ బిట్టు శ్రీను కు ఫోన్‌ చేస్తే.. మంథనిలో ఉండొద్దని అతడికి సూచించాడు. దాంతో సుందిళ్ల బ్యారేజీ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్తూ బ్యారేజీ మీద ఆగి బట్టలు, కత్తులు కట్ట కట్టి, దానికి బండ కట్టి బ్యారేజీలో వేశారు. ఫోన్లు కూడా బ్యారేజీలో పడేశారు. డ్రైవర్‌ చిరంజీవి తన ఫోన్‌లో సిమ్‌ విరిచి కొత్తది వేసుకున్నాడు’అని రిమాండ్‌ రిపోర్టులో పోలీసు లు పొందుపరిచినట్లు సమాచారం. లచ్చయ్య పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారని తెలిసింది.   

చదవండి: (ఆ హత్యల కేసులో ఎంతటివారున్నా వదలం)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు