చేర్యాలలో లజ్జా గౌరీ శిల్పం

14 Jun, 2021 08:25 IST|Sakshi

ఎనిమిది అడుగుల ఎత్తున్న గుండుపై అమ్మదేవత ఆకృతి 

సాక్షి,హైదరాబాద్‌: అమ్మతనానికి ప్రతీకగా భావించే లజ్జా గౌరీ (అమ్మ దేవత) పురాతన శిల్పం చేర్యాల మండల కేంద్రం శివారులో బయల్పడింది. ఎనిమిది అడుగుల ఎత్తున్న గుండుకు చెక్కిన ఈ శిల్పాన్ని ఔత్సాహిక పరిశోధకులు రత్నాకరరెడ్డి ఆదివారం పరిశీలించారు. ఓ వ్యవసాయ పొలంలో ఉన్న ఈ గుండుకు ఓవైపు భైరవుడి రూపం ఉంది. మరోవైపు సన్నగా, విస్తృత కటి భాగంతో నగ్నంగా కూర్చున్నట్లు ఉండే ఈ శిల్పం ప్రసవస్థితిలో ఉన్నట్టుగా ఉంది. లజ్జా గౌరీ రూపం నగ్నంగా ఉంటున్నందున శిరస్సు స్థానంలో పద్మం ఆకృతిని చెక్కుతారు.

వివిధ ప్రాంతాల్లో వెలుగు చూసిన శిల్పాలు కూడా ఇదేవిషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. కానీ చేర్యాలలో గుండుకు చెక్కిన రూపంలో పద్మం బదులుగా తలభాగం ఉండటం విశేషం. సాధారణంగా లజ్జా గౌరీ ఆరాధన మనోవికారాన్ని నివారించటంతోపాటు మోహ, ఆధ్యాత్మిక భావనలు కలిగిస్తుందంటారు చరిత్రకారులు. గతంలో లజ్జా గౌరీ ఆరాధన విస్తృతంగా ఉండేదని, కాలక్రమంలో తగ్గిపోయిందని రత్నాకరరెడ్డి తెలిపారు. చేర్యాలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర విగ్రహాలు కూడా బయల్పడ్డాయి.
చదవండి: కరోనా: బూస్టర్‌ డోస్‌లతో వేరియెంట్లకు చెక్‌ 

మరిన్ని వార్తలు