భూముల డిజిట‌ల్ స‌ర్వేపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

3 Jun, 2021 12:38 IST|Sakshi

టీపన్‌ నక్ష విధానమే ప్రాతిపదిక: సీఎం కేసీఆర్‌

గ్రామసభల్లో అవగాహన కల్పించిన తర్వాతే సర్వే

తప్పులు జరిగితే చర్యలకు ఏమాత్రం వెనుకాడం

భూ తగాదాల్లేని భవిష్య తెలంగాణ కోసమే.. 

భూ సర్వే కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి 

‘పైలట్‌’లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి 3 గ్రామాలు

అన్నీ నిర్ధారించుకున్న తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా అమలు

గ్రామాల్లో పూర్తయిన తర్వాత పట్టణాల్లో సర్వేకు చాన్స్‌

ఈ నెల 11 నుంచి పైలట్‌ డిజిటల్‌ సర్వే

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలోని పేదలకు ఉన్న పట్టా భూములకు హక్కుల విషయంలో రక్షణ కల్పించేందుకే ధరణి పోర్టల్‌ను అమల్లోకి తెచ్చినం. భూ తగాదాల్లేని భవిష్య తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల డిజిటల్‌ సర్వే చేయిస్తోంది. భూములను సర్వే చేయడం ద్వారా వాటి అక్షాంశ, రేఖాంశాలను (కో–ఆర్డినేట్స్‌) గుర్తించి పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వ సదుద్దేశాన్ని అర్థం చేసుకుని వ్యాపార కోణం నుంచి మాత్రమే కాకుండా సేవాభావంతో ఈ బృహత్‌ కార్యాన్ని నిర్వహించండి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సర్వే కంపెనీలకు పిలుపునిచ్చారు.

గ్రామాల్లో భూ తగాదాలు లేని విధంగా ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల వ్యవహారాలను చక్కదిద్దిన నేపథ్యంలో ఈ డిజిటల్‌ సర్వే కూడా నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేపట్టనున్న భూముల డిజిటల్‌ సర్వేపై చర్చించేందుకు  ప్రగతిభవన్‌లో ఆయన సర్వే ఏజెన్సీలు, కంపెనీల ప్రతినిధులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వే పద్ధతులు, సాంకేతిక అంశాలతో పాటు పలు రాష్ట్రాల్లో భూముల సర్వే అమలయిన తీరుపై కూలంకషంగా చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.

అందరూ సహకరిస్తారు...
గ్రామాల్లో భూ సర్వే విధానంలో అవలంభిస్తున్న టీపన్‌ నక్షా విధానాన్ని ప్రాతిపదికగా చేసుకుని సర్వే నిర్వహించాలని సీఎం సూచించారు. గ్రామ సభలను నిర్వహించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, ఈ క్రమంలో అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పారు. జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని, సర్వే నిర్వహించే క్రమంలో ఏజెన్సీలకు సహకరిస్తారని వెల్లడించారు. అయితే, సర్వే నిర్వహణ పూర్తి బాధ్యతలు మాత్రం ఏజెన్సీలదేనని స్పష్టం చేశారు. భూపరిపాలనలో రోజురోజుకూ గుణాత్మక మార్పులు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘ఆది మానవుని కాలంలో భూమి మీద హక్కులు లేవు.

మనిషి వ్యవసాయం నేర్చుకున్న తర్వాతి పరిణామాల్లోనే భూమి మీద హక్కు ప్రారంభమైంది. ఆ తర్వాత రాజుల కాలం నుంచి నేటి ప్రజాస్వామిక దశ వరకు భూహక్కుల ప్రక్రియలో అనేక మార్పులొచ్చాయి. మారుతున్న కాలంతో పాటు ప్రభుత్వాలు కూడా ప్రజల భూములు, ఆస్తులకు రక్షణ కల్పించే విషయంలో ఆధునీకరణ చెందాలి. అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంటుంది’ అని సర్వే ఏజెన్సీల ప్రతినిధులను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాన్ని అర్థం చేసుకుని కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు.

తగాదాలు లేకపోతే జీడీపీ పెరుగుతుంది..
భూతగాదాలను నూటికి నూరు శాతం పరిష్కరించుకున్న దేశాల్లో జీడీపీ 3 నుంచి 4 శాతం పెరిగిందని గణాంకాలు నిరూపిస్తున్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. గత పాలకులు విస్మరించిన ప్రజా సమస్యలో భూ సర్వే కూడా మిగిలిపోయిందని, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఈ క్రమంలో చిన్న తప్పు జరిగినా భవిష్యత్‌ తరాలు మూల్యం చెల్లించుకుంటాయని, ప్రభుత్వాలు చేసే తప్పులకు పేద ప్రజలు ఇబ్బందులు పడొద్దన్నదే తెలంగాణ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. అందుకే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందు చూపుతో భూముల డిజిటల్‌ సర్వే చేపట్టామని, భవిష్యత్తు తరాలకు తగాదాలు లేని భూములన్న తెలంగాణను అందించడమే లక్ష్యమని సర్వే సంస్థల ప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

సర్వే చేయండిలా.. 
సమావేశంలో భాగంగా భూముల డిజిటల్‌ సర్వేకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. ముందుగా రాష్ట్రంలో పైలట్‌ పద్ధతిలో భూములను సర్వే చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆయన ఆదేశించారు. జూన్‌11వ తేదీ నుంచి ఈ పైలట్‌ డిజిటల్‌ సర్వేను చేపట్టాలని, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని సూచించారు. అందులో 3 గ్రామాలను గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి తీసుకోవాలని, మిగిలిన 24 గ్రామాలను జిల్లాకు ఒకటి చొప్పున 24 జిల్లాల నుంచి ఎంపిక చేయాలని ఆదేశించారు. భూతగాదాలు లేని గ్రామాల్లో పైలట్‌ సర్వేను ప్రారంభించాలని, ఆ తర్వాత అటవీ, ప్రభుత్వ భూములు కలిసి ఉన్న గ్రామాల్లో చేయాలని కోరారు. సమస్యలు ఉన్న, సమస్యలు లేని గ్రామాల్లో మిశ్రమంగా సర్వే నిర్వహించి క్షేత్రస్థాయి అనుభవాన్ని తెలుసుకోవాలని, ఆ తర్వాతే పూర్తి స్థాయి సర్వేకు విధివిధానాలు ఖరారు చేయాలని సూచించారు.

ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టాలని, అవి పూర్తయిన తర్వాత పట్టణ భూముల సర్వే చేపట్టే అవకాశముందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శాసనసభ మాజీ స్పీకర్‌ మదుసూధనాచారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శి భూపాల్‌రెడ్డి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.శేషాద్రి, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు, సర్వే లాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ శశిధర్, టీఎస్‌టీఎస్‌ ఎండీ వెంకటేశ్వరరావులతో పాటు పలు డిజిటల్‌ సర్వే సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.   

చదవండి: 

Fact Check: కేంద్రం మన ఫోన్ కాల్స్ రికార్డు చేస్తుందా?

మరిన్ని వార్తలు