అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ పంచాయితీ

17 Sep, 2020 09:59 IST|Sakshi
నెన్నెల శివారులో వివాదాస్పద భూములు

సాక్షి, నెన్నెల: రెవెన్యూ, అటవీ శాఖల భూములకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడం.. ఇరుశాఖల మధ్య సమన్వయలోపంతో పేద రైతులు నష్టపోతున్నారు. ఇరు శాఖల సంయుక్త సర్వేతో సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నా.. ఆ దిశగా సరైన కార్యాచరణ లేక ఏళ్ల తరబడి భూముల సమస్య ఎడతెగడం లేదు. జిల్లాలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన భూములు పలుచోట్ల వివాదాల్లో చిక్కుకున్నాయి. రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చిన తర్వాత భూమిని సాగు చేసుకునేందుకు వెళ్లిన లబ్ధిదారులను అటవీ శాఖ సిబ్బంది అడ్డుకుంటున్నారు.

ఆ భూమి రిజర్వు ఫారెస్ట్‌కు చెందినదని, ఎవరూ సాగు చేయవద్దని అభ్యంతరాలు తెలుపుతున్నారు. కొన్నిచోట్ల కేసులు కూడా నమోదు చేస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్‌ను ఆనుకొని ఉన్న మండలాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు జాయింట్‌ సర్వే నిర్వహిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. కా ని రెండు శాఖల అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల భూములు వివాదంలో చిక్కుకున్నాయి. ఫలితంగా 10 వేల మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు. 

కొరవడిన సమన్వయం
రెవెన్యూ శాఖ జిల్లాలోని మిగులు భూములను గుర్తించి.. పేదలకు పట్టాలు ఇచ్చి.. సాగు చేసుకోవచ్చని రైతులకు భ రోసా ఇచ్చింది. అయితే ఆ భూములన్నీ రిజర్వు ఫారెస్ట్‌వని, అందులో పంటలు ఎలా వేస్తారని అటవీ శాఖ అధికారులు కేసులు పెడుతున్నారు. దీంతో పట్టాలు పొందిన నిరుపేదల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో సరైన రికార్డులు లేకపోవడమే ఈ వివాదాలకు కారణమవుతోంది.

వివాదం ఎందుకు..?
రైతులకు పంపిణీ చేసిన భూములు వివాదాస్పదం కావడానికి పలు కారణాలు ఉన్నాయి. రిజర్వు ఫారెస్ట్‌ భూములకు హద్దులు లేకపోవడం ఒక కారణమైతే.. రైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్న రెవెన్యూ అధికారులు వారికి పొజిషన్‌ చూపించకపోవడం మరో కారణం. ఈ సమస్యతో ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇరు శాఖల ఆధ్వర్యంలో సంయుక్త సర్వే నిర్వహిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో  ఏళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. తమ సమస్య పరిష్కరించాలంటూ బాధితులు తహసీల్దార్లు మొదలు కలెక్టర్‌ వరకు, ఎంపీపీ మొదలు ఎమ్మెల్యే వరకు మొరపెట్టుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. 

వివాదంలో 25 వేల ఎకరాలు
జిల్లాలోని 18 మండలాల్లో దాదాపు 25 వేల ఎకరాల భూములు అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో చిక్కుకుని ఉన్నాయి. అత్యధికంగా ప్రభుత్వ భూములు ఉన్న నెన్నెల మండలంలో 7,600 ఎకరాలు, నెన్నెల, బొప్పారం గ్రామాల మధ్య ఉన్న సర్వే నంబర్‌ 671, 672, 674లో 1200 ఎకరాలు, నెన్నెల మండలం సింగాపూర్‌లో సర్వే నంబర్‌ 34, 36లో 950 ఎకరాలు, కొంపెల్లి, పొట్యాల, కొత్తూర్‌ శివారు సర్వే నంబర్‌ 4/2,4/3లో 600 ఎకరాలు, కోనంపేట సమీపంలోని చీమరేగళ్ల వద్ద సర్వే నంబర్‌ 660లో 700 ఎకరాలు, పుప్పాలవానిపేటలో సర్వే నంబర్‌ 165/82, 125/82లో 600 ఎకరాలు, కుశ్నపల్లిలో సర్వే నంబర్‌ 67లో 400 ఎకరాలు, సీతానగర్‌లోని సర్వే నంబర్‌ 1లో 1425 ఎకరాలు, జంగల్‌పేటలోని సర్వే నంబర్‌ 22, 24, 27, 55లో 600 ఎకరాలు, జైపూర్‌ మండలం గుత్తేదారిపల్లి శివారులోని సర్వే నంబర్‌ 368, 369/12లో 200 ఎకరాలు, వేమనపల్లి మండలం గోదుంపేటలోని సర్వే నంబర్‌ 3లో 350 ఎకరాలు, శ్రావణ్‌పల్లి శివారులోని సర్వే నంబర్‌ 61లో వంద ఎకరాలు, సూరారంలో మరో 200 ఎకరాలు, చెన్నూర్‌ మండలం కన్నెపల్లి, బుద్దారం, కంకారం గ్రామాలకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్‌ 354లో 800 ఎకరాలు, మందమర్రి మండలం సారంగపల్లిలో సర్వే నంబర్‌ 33లో 220 ఎకరాలు, కన్నెపల్లి మండలం రెబ్బెనలో సర్వే నంబర్‌ 247లో 250 ఎకరాలు, ఆనందాపూర్‌లోని సర్వే నంబర్‌ 101లో 120 ఎకరాలు, మెట్‌పల్లిలోని సర్వే నంబర్‌ 20, 22లో 150 ఎకరాలు, జజ్జరవెల్లి సర్వే నంబర్‌ 88, 89లో 400 ఎకరాల భూమి వివాదంలో ఉంది.

కోటపల్లి మండలం కొండంపేట, పారిపల్లిలో దాదాపు 800 ఎకరాలు, సిర్పూర్‌లో 6800 ఎకరాలు, ఉట్నూర్‌లో 4300 ఎకరాలు, కౌటాలలో 3600, రెబ్బెనలో 2900, దహెగాంలో 580 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. తాండూర్, బెజ్జూర్, సిర్పూర్‌(టీ), ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కడెం, ఖానాపూర్, ఇంద్రవెల్లి మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. భూమి తమదంటే తమదని ఇరు శాఖల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. దీంతో వేల ఎకరాల భూములు బీళ్లుగా మారాయి. 

జాయింట్‌ సర్వేపై జాప్యం
ఆర్భాటంగా పట్టాలు అందజేసిన అధికారులు, ప్ర జాప్రతినిధులు ఆ తర్వాత పేదల సమస్యలను ప ట్టించుకోవడం లేదు. కేటాయించిన భూములు ఏ శాఖకు చెందుతాయో నిర్ధారించాల్సిన జాయింట్‌ స ర్వేలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం కేటాయించిన భూమి మోకా (పొజిషియన్‌) ఎక్కడుందనేది చూపకపోవడంతో ఆ నంబర్‌లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దున్నడం ప్రారంభించారు. రైతులు సర్వే నంబర్‌ ఆ«ధారంగా ప్రభుత్వ భూమిలోనే సాగు చేసుకుంటున్నారు.

కొన్నాళ్లు సాగు చేసుకున్నాక ఆ భూ ములు రిజర్వు ఫారెస్ట్‌కు చెందినవని అటవీ శాఖ అడ్డుకుంటోంది. రికార్డులో మాత్రం పీపీ ల్యాండ్‌కు పట్టాలు ఇస్తున్నామని రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. పట్టాల పేరిట అటవీ భూములను కబ్జా చే స్తున్నారని ఫారెస్ట్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. అట వీ భూములు నిర్ధారించేందుకు చాలా ప్రాంతాల్లో సరైన హద్దులు లేవు. దీంతో రిజర్వు ఫారెస్ట్‌ సరిహద్దులేవో తెలియడం లేదు. ప్రభుత్వం జిల్లాలో రక్షిత అటవీ ప్రాంతాన్ని గుర్తించినప్పుడు అందుకు అనుగుణంగా రికార్డుల్లో మార్పులు చేయలేదు. దీంతో మిగులు భూములపై వివాదం కొనసాగుతోంది. 

ముల్కల్లలో  భూముల పరిశీలన
మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): అటవీ, రెవె న్యూ శాఖల మధ్య నలుగుతున్న హాజీపూర్‌ మండలం ముల్కల్లలోని భూములను అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పరిశీలించారు. 1991లో ఏసీసీ పరిధిలోని 11 ఎకరాలను అటవీశాఖకు కేటాయించారు. తమ శాఖ భూములను అటవీ శాఖ ఆక్రమించుకుంద ని రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, అటవీశాఖల వద్ద ఉన్న రికార్డుల ను ఆమె పరిశీలించారు. 205 సర్వే నంబర్‌లోని 23.10 ఎకరాలు అటవీశాఖ కబ్జాలో ఉండగా.. అటవీ శాఖకు 11, మిగిలిన 12 ఎకరాలు రెవెన్యూ శాఖకు రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించారు. సమగ్ర సర్వే జరిపి రెండురోజుల్లో ఇరు శా ఖల భూ హద్దులు నిర్ణయించాలని అధికారులకు జారీ చేశారు. ఆమె వెంట తహసీల్దార్‌ మహ్మద్‌ జమీర్, ఎంపీడీఓ అబ్దుల్‌హై, లక్సెట్టిపేట అటవీ రేంజ్‌ అధికారి నాగావత్‌ స్వామి, గిర్దావర్‌ రాజ్‌మహ్మద్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ముల్కల్ల బీట్‌ అధికారి తిరుపతి ఉన్నారు.   

మరిన్ని వార్తలు