Muthireddy Yadagiri Reddy: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి!

9 May, 2023 12:47 IST|Sakshi

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు అధికార పార్టీ బీఆర్ఎస్‌కు చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముత్తిరెడ్డిపై సొంత కూతురే కేసు పెట్టడం కలకలం రేపుతోంది. నాచారంలో తన పేరిట ఉన్న ప్లాట్ ను ఫోర్జరీ సంతకాలతో లీజ్ అగ్రిమెంట్ చేయించాడని కూతురు తూల్జ భవాని రెడ్డి ఉప్పల్‌ స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే పై చీటింగ్‌తోపాటు పలు సెక్షన్ల  కింద కేసులు నమోదు చేశారు. 

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేరు కొంత కాలంగా వివాదస్పదంగా బయటకు వస్తోంది. నోటి దురుసుతనం, వ్యవహార శైలితో ఇంటా బయట విమర్శలు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా సొంత కూతురు తూల్జ భవాని రెడ్డి తన పేరిట  నాచారంలో ఉన్న 159 గజాల కమర్షియల్ బిల్డింగ్‌కు సంబంధించి తన సంతకాన్ని తండ్రి ఫోర్జరీ చేసి కినారా గ్రాండ్‌కు అక్రమంగా లీజ్ అగ్రిమెంట్  చేయించాడని ఉప్పల్ పోలీసులకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు.  పోలీసులు పిబ్రవరి 4న ముత్తిరెడ్డి పై సెక్షన్ 406, 420, 463,464,468, 471, R/w  34ipc,156 (3)crpc ప్రకారం కేసులు నమోదు చేశారు. 

ముత్తిరెడ్డిపై ఆరోపణలు
► యశ్వంతపూర్‌లో  బతుకమ్మ కుంట 6 ఎకరాల భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమించారని గతంలో  హైకోర్టుకు వెళ్ళారు  మాజీ సర్పంచ్. బతుకమ్మ కుంట భూఆక్రమణపై అప్పటి కలెక్టర్ దేవసేనతో ముత్తిరెడ్డికి గొడవ సైతం జరిగింది. 

► నర్మెట్ట మండలం హన్మంతపూర్ శివారులో ప్రభుత్వ భూమి 70 ఎకరాలు ఎమ్మెల్యే కబ్జా చేశాడని ఆరోపణలున్నాయి. 

► చేర్యాల మండల కేంద్రంలోని అంగడి స్థలం ఎకరం 20 గుంటలు ఆక్రమించి ప్రహరీ నిర్మించాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయంపై గతంలో అఖిలపక్షం ఆందోళనకు దిగి చెర్యాల బంద్‌కు పిలుపునిచ్చింది. 

► గొల్లకురుమలు జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన భూమిని సైతం ఎమ్మెల్యే వదల లేదనే ఆరోపణలు ఉన్నాయి.
చదవండి: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన కుమార్తె

మరిన్ని వార్తలు