గండిపేట గంతే

19 Aug, 2020 10:13 IST|Sakshi

ఇటీవల వరుసగా కురిసిన వర్షాలు 

ఒక్క అడుగూ పెరగని నీటిమట్టం 

ఫాంహౌస్‌లు, విల్లాలు, కళాశాలల కబ్జా 

ఇన్‌ఫ్లో ఛానల్స్‌ మూసుకుపోవడమే కారణం  

హిమాయత్‌సాగర్‌లో కాస్త ఫర్వాలేదు 

రెండు అడుగులు పెరిగిన జలమట్టం  

ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షపాతం  

నిండుకుండను తలపిస్తున్న ఎల్లంపల్లి  

సాగర్‌లో పెరుగుతున్న నీటి నిల్వలు 

సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కురిసిన వరుస వర్షాలు నగరాన్ని ముంచెత్తినా.. చారిత్రక గండిపేట (ఉస్మాన్‌సాగర్‌) జలాశయం నీటిమట్టం ఒక్క అడుగు కూడా పెరగలేదు. హిమాయత్‌సాగర్‌ జలాశయంలో స్వల్పంగా రెండు అడుగుల మేర నీరుపెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వరదను ఈ జంటజలాశయాలకు చేర్చే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ కబ్జాకు గురి కావడంతోనే ఈ దుస్థితి తలెత్తిందన్న విషయం సుస్పష్టమవుతోంది.ప్రధానంగా వికారాబాద్, శంకర్‌పల్లి తదితర ప్రాంతాల్లోని సుమారు 84 గ్రామాల పరిధిలో కురిసిన వర్షపాతాన్నిఈ రెండు జలాశయాల్లోకి చేర్చే ఆరు కాల్వలను ఫాంహౌస్‌లు, విల్లాలు, రియల్‌ వెంచర్లు, ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఇసుక మాఫియా ఫిల్టర్స్, ఇతర విద్యా సంస్థలు, గోడౌన్లు.. ఇలా పలు రకాలుగా అక్రమార్కులు కబ్జా చేశారు.

గతంలో రెవెన్యూ, పంచాయతీరాజ్‌ విభాగాలు సర్వే చేసి సుమారు 5 వేల ఆక్రమణలను గుర్తించినప్పటికీ వీటిని తొలగించలేదు. దీంతో జలాశయాల్లోకి వరదనీరు చేరడం లేదు. గండిపేట జలాశయం గరిష్ట మట్టం 1790 అడుగులకు మంగళవారం నాటికి 1754 అడుగుల మేర ఉంది. హిమాయత్‌సాగర్‌ జలాశయం గరిష్ట మట్టం 1763.500 అడుగులకు.. ప్రస్తుతం 1737.100 అడుగుల మేర నీటి నిల్వలుండడం గమనార్హం. గతేడాది ఈ జలాశయాలు ప్రస్తుతం కంటే అధిక నీటి నిల్వలతో కళకళలాడిన విషయం విదితమే. ప్రస్తుతం గండిపేట జలాశయం నుంచి నిత్యం నగర తాగునీటి అవసరాలకు 2 మిలియన్‌ లీటర్లు.. హిమాయత్‌సాగర్‌ నుంచి 26 మిలియన్‌ లీటర్ల నీటిని జలమండలి తరలించి శుద్ధి చేసి నగరంలో పలు ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. 

ఎగువ ప్రాంతాల్లో భారీగా.. 
జలాశయాల్లోకి వరద నీరు తరలివచ్చే శంకర్‌పల్లి, వికారాబాద్, మొయినాబాద్, మోమిన్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో ఈసారి సాధారణం కంటే సుమారు 15 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయినా జలాశయాల్లోకి వరదనీరు చేరకపోవడానికి ప్రధాన కారణం ఇన్‌ఫ్లో ఛానల్స్‌ కబ్జా కాటుకు గురయ్యాయన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ రెండు జలాశయాలు పూర్తిస్థాయి నీటి నిల్వలలతో కళకళలాడితే నగరానికి నిత్యం సుమారు 60 మిలియన్‌ గ్యాలన్ల తాగునీటిని తరలించవచ్చు. ఈ నీటితో నగరంలోని పాతనగరంతో పాటు పలు శివారు ప్రాంతాల దాహార్తిని తీర్చే అవకాశం ఉంటుందని జలమండలి వర్గాలు తెలిపాయి. 

ఎల్లంపల్లి, సాగర్‌కు జలశోభ.. 
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మహానగర దాహార్తిని తీరుస్తున్న ఎల్లంపల్లి (గోదావరి– మంచిర్యాల జిల్లా) జలాశయం పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకుంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 485.560 అడుగులు. ప్రస్తుతం 484.480 అడుగులకు చేరుకుంది. మరో జలాశయం నాగార్జునసాగర్‌ (కృష్ణా)కు నిలకడగా ఇన్‌ఫ్లో చేరుతుండడంతో దీని నీటిమట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. నాగార్జునసాగర్‌ గరిష్ట మట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుతం 567.900 అడుగుల మేర నీటి నిల్వలున్నాయి. ఈ జలాశయం కూడా త్వరలో పూర్తిస్థాయిలో జలకళ సంతరించుకుంటుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

మరిన్ని వార్తలు