భూమి కబ్జా చేశారంటూ..

17 May, 2022 04:45 IST|Sakshi

ప్రజావాణికి పెట్రోల్‌తో వచ్చిన వృద్ధురాలు 

ఆదిలాబాద్‌ అర్బన్‌: ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధురాలు పెట్రోల్‌ బాటిల్‌ వెంట తెచ్చుకోవడం కలకలం రేపింది. తన భూమిలో కొందరు అక్రమంగా ఉంటూ కొట్టం నిర్మిస్తున్నారని, తన చేను తనకు దక్కేలా చూడాలని కోరుతూ దరఖాస్తు రాసుకుని ఆదిలాబాద్‌ పట్టణం బొక్కలగూడకు చెందిన కొమ్ము నాగమ్మ ప్రజావాణికి వచ్చింది.

ముందుగా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను కలసి అర్జీ అందజేసింది. అది చదివిన కలెక్టర్‌ ‘మీ భూమిని మీరే కాపాడుకోవాలి..’అని చెప్పి పంపించారు. దీంతో నిరాశకు లోనైన నాగమ్మ బయటకు వచ్చి అక్కడున్న వారందరికీ తన సమస్య తెలిపింది. ఆమెతో వచ్చిన మరో ఇద్దరు కూడా నాగమ్మ సమస్య పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఇక్కడే చనిపోయేందుకు పెట్రోల్‌ బాటిల్‌ తెచ్చుకుందని తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. నాగమ్మకు నచ్చజెప్పారు. దాంతో ఆమె మళ్లీ కలెక్టర్‌ను కలిసేందుకు లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా నాగమ్మ తన సమస్యను పూర్తిగా వివరించింది. ‘నాకు ఖానాపూర్‌ శివారులో సర్వే నంబర్‌ 68/93లో 1.05 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి శిరీష అనే మహిళ అధీనంలో ఉండేది.

2021 జూన్‌లో శిరీష చనిపోయింది. ఆమె బతికి ఉన్నప్పుడే ఈ భూమిని నాకు ఇచ్చేసింది. నేను భూమి పట్టా బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకుని ఎవుసం చేసుకుంటున్నా. అయితే శిరీష బంధువులు పోయిన డిసెంబర్‌లో నా భూమిని కబ్జా చేసుకున్నరు. అక్రమంగా కొట్టం కడుతున్నరు. నేను చేనుకాడికి పోతే చంపుతామని బెదిరిస్తున్నరు. నా భూమి నాకు ఇప్పించుండ్రి’ అని నాగమ్మ వివరించింది. సమస్యను గుర్తించిన కలెక్టర్‌ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు