కబ్జా కోరల్లో చింతల చెరువు?

24 May, 2021 17:49 IST|Sakshi

ఎఫ్‌టీఎల్‌ పరిధిలో మట్టి, బఫర్‌ జోన్‌లో నిర్మాణాలు

ఉన్నతాధికారులకు మాజీ ప్రజాప్రతినిధుల ఫిర్యాదు

పట్టించుకోని అధికారులు

హైదరాబాద్‌: బోడుప్పల్‌ నగర పాలక సంస్థ పరిధిలోని చెంగిచర్లలో ఉన్న చింతల చెరువు ఎఫ్‌టీఎల్‌ భూమి, బఫర్‌ జోన్‌ అన్యాక్రాంతమవుతుంది. ఇప్పటికే బఫర్‌ జోన్‌లో కొంత భాగం కాలనీగా ఏర్పడి కొన్ని ఇళ్లు నిర్మించుకోగా, మిగిలిన స్థలంలో మట్టినింపి చదును చేస్తున్నారు.  అదే బఫర్‌ జోన్‌ పరిధిలో బహుళ అంతస్తులు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిపై మాజీ ప్రజాప్రతినిధులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.  

చెంగిచర్లలోని చింతల చెరువు సర్వే నంబరు 57లో 23 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఒకప్పుడు తాగు, సాగునీరు అందించిన ఈ చెరువు నేడు మురికి కూపంగా మారింది.  చెంగిచర్ల ఎగువ ప్రాంతంలో ఉన్న కాలనీలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చేపట్టగా మురుగునీరు దిగువ ప్రాంతానికి వెళ్లడానికి అవుట్‌ లెట్‌ లేకపోవడంతో కాలనీల నుంచి వచ్చే మురుగంతా చెరువులోకి వెళ్తుంది. దీంతో చెరువు అంతా మురుగునీటితో కూపంగా మారి విపరీతమైన దుర్వాసన వస్తుంది.   గతంలో చెరువు ఎఫ్‌టీఎల్‌ హద్దులు ఏర్పాటు చేయక ముందు కొంత మంది సాయినగర్‌ కాలనీని ఏర్పాటు చేయగా, మరికొంత మంది ఇళ్లు నిర్మించుకున్నారు. 

ప్రస్తుతం అధికారులు, పాలకవర్గం ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇటీవల కొంత మంది ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న తమ ప్లాట్లకు ఎన్‌ఓసీలు తెచ్చుకుని మట్టి పోసి చదును చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయమై స్థానిక ప్రజలు అధికారులు, పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.  చెంగిచర్ల చింతల చెరువు కట్ట ఆనుకుని ఉన్న బఫర్‌ జోన్‌లో ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరుపై ఉన్న స్థలంలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని మాజీ వార్డు సభ్యులు కుర్రి శివశంకర్, కొత్త ప్రభాకర్‌గౌడ్‌ మేడ్చల్‌ జిల్లా కలెక్టర్, ఇరిగేషన్, రెవెన్యూ, కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.  చెరువు కట్ట ఆనుకుని  బఫర్‌ జోన్‌ ఉందని, సదరు స్థలానికి రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు ఎన్‌ఓసీ ఇవ్వగా మున్సిపల్‌ అధికారులు ఎలాంటి పర్యవేక్షణ చేయకుండా అనుమతులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. 

 నిబంధలనకు అనుగుణంగానే..
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఎన్‌ఓసీ ప్రకారమే అనుమతులిచ్చాం. ఎన్‌ఓసీలో కట్ట అనుకుని మొత్తం  50 గజాలు బఫర్‌ జోన్‌ ఉన్నట్లు చూపారు. దాని ప్రకారం అనుమతులు మంజూరు చేశాం. మా నగరపాలక సంస్థ నుంచి ఎలాంటి అవకతవకలు జరగలేదు.  
–బోనగిరి శ్రీనివాస్, కమిషనర్‌  

మరిన్ని వార్తలు