భూముల ధరలకు రెక్కలు.. ‘రింగ్‌’ రియలేనా?

16 Oct, 2022 13:15 IST|Sakshi
రేగడి చిల్కమర్తి గ్రామ శివారులో రోడ్డుపై మార్కింగ్‌

రింగ్‌రోడ్డు వస్తోందని సోషల్‌మీడియాలో హల్‌చల్‌   

భూముల ధరలకు రెక్కలు

జోరందుకున్న రియల్‌ వ్యాపారం  

సాక్షి, రంగారెడ్డి/ కొందుర్గు: గత కొంతకాలంగా స్తబ్దతగా ఉన్న రియల్‌ వ్యాపారం ఒక్కసారిగా జోరందుకుంది. రింగ్‌రోడ్డు వస్తుందంటూ వార్తలు రావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చినట్లయింది. అయితే “రింగ్‌’ రియల్‌గా ఎక్కడి నుంచి వెళ్తుందో ఎవరి భూములు రోడ్డుకు పోతాయో, ఎవరి భూ ములు మిగులుతాయో అంటు స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. 

ఇటీవలే గూగుల్‌ ఎర్త్‌మ్యాప్‌ ద్వారా రోడ్డు వెళ్లే మార్గం సూచిస్తున్న గూగుల్‌ మ్యాప్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో, చుట్టుపక్కల భూముల రైతులు తమ భూములకు మంచి ధరలు వస్తాయని ఆశల పల్లకీలో తేలుతున్నారు. మండలంలో ఇప్పటికి వరకు ఎకరం భూమి ధర రూ.40 లక్షల నుంచి 80 లక్షల వరకు ఉండేది. కాగా, రింగ్‌రోడ్డు ప్రకటనతో ఏకంగా ఎకరం కోటి రూపాయలు దాటింది. ఎక్కడ మారుమూల ప్రాంతంలో భూమి కొనుగోలు చేద్దామన్నా రూ.80 లక్షలకు తక్కువ దొరకడం లేదని రియల్‌ వ్యాపారులు అంటున్నారు.  

ఇన్నర్, ఔటర్‌ గ్రామాలు ఇవే.. 
చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు నిర్మించనున్న దక్షిణ భాగం రీజినల్‌ రింగ్‌రోడ్డుకు సంబంధించి గ్రామాల్లో మార్కింగ్‌ కూడా చేసినట్లు తెలిసింది. ఇక తాజాగా రోడ్డుకు లోపలి గ్రామాలు, వెలుపలి గ్రామాల జాబితా విడుదల చేసినట్లు గ్రామాల జాబితా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా రెవెన్యూ గ్రామాల వారీగా ఎన్ని కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తారోనని గ్రామాల జాబితాలో నమోదు చేయడం జరిగింది. దీంతో ఇక రింగ్‌రోడ్డు వెళ్లేది ఖాయమేనని రియల్‌ వ్యాపారులు, రైతులు నమ్ముతున్నారు. 

రింగ్‌ రోడ్డు ఇలా వెళ్తుందా..?  
సంగారెడ్డి జిల్లా కొండాపూర్, కంది మండలాల నుంచి వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్, నవాబ్‌పేట్, పూడూర్‌ మండలాల మీదుగా రంగారెడ్డి చేవెళ్ల, శంషాబాద్, షాబాద్, కొందుర్గు, ఫరూఖ్‌నగర్, కేశంపేట, తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, మంచాల మండలాల మీదుగా రింగ్‌రోడ్డు వెళ్లనున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇదే అదును చేసుకొని రియల్‌ వ్యాపారులు ఓ అడుగు ముందుకేసి తమ వ్యాపారానికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇక రోడ్డు ఎక్కడి నుంచి వెళ్తుందో భూముల ధరలు ఎంతవరకు పెరుగుతాయో వేచి చూడాల్సిందే.  

మాకు ఎలాంటి సమాచారం లేదు 
మండల పరిధిలోని ఆయా గ్రామాల గుండా రింగ్‌ రోడ్డు వస్తుందని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. అయినా, ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. సోషల్‌ మీడియాలో వస్తున్న  పుకార్లును నమ్మి రియల్‌ వ్యాపారుల ఉచ్చులో పడి రైతులు మోసపోవద్దు. 
– తహసీల్దార్, రమేష్‌కుమార్, కొందుర్గు.   

మరిన్ని వార్తలు