పాస్‌పోర్టు సేవలు, రిజిస్ట్రేషన్లు నిలిపివేత

12 May, 2021 13:38 IST|Sakshi

రాంగోపాల్‌పేట్‌(హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రకాల పాస్‌పోర్టు సేవలను నిలిపివేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు సేవా లఘు కేంద్రాలు, పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో అన్ని సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ పాటికే దరఖాస్తు చేసుకున్న వారు తమ అపాయింట్‌మెంట్లను రీ షెడ్యూల్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ ఆవరణలోనే ఉండే విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన బ్రాంచ్‌ సెక్రటేరియేట్‌ కార్యకలాపాలను కూడా నిలిపివేస్తున్నట్లు ఆయన వివరించారు.  

లాక్‌డౌన్‌ కాలంలో నో రిజిస్ట్రేషన్‌.. 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉదయం 10 గంటల తర్వాత ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు జరగవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. లాక్‌డౌన్‌ మినహాయింపు కేటగిరీలో రిజిస్ట్రేషన్ల శాఖను చేర్చకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారికి పాస్‌లు జారీ చేయరని, ప్రజలెవరూ రిజిస్ట్రేషన్ల కోసం రావొద్దని తెలిపారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినందున రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు తెరిచే ఉంటాయని, రిజిస్ట్రేషన్లు మాత్రం జరగవని వెల్లడించారు.

మరిన్ని వార్తలు