ఈటలపై పోలీసులకు ఫిర్యాదులు.. ఆస్తులపై ఆరా! 

3 May, 2021 09:25 IST|Sakshi

భూకబ్జా, బెదిరింపులు, అట్రాసిటీ కంప్లయింట్స్‌ ఇచ్చే అవకాశం

 నేడు విజిలెన్స్‌ రిపోర్టు తరువాత వేగంగా మారనున్న పరిణామాలు

రాష్ట్రవ్యాప్తంగా రాజేందర్‌ ఆస్తులపై ఆరా తీస్తోన్న ప్రభుత్వం   

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విషయంలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో దాదాపు 66 ఎకరాల భూమిని మంత్రి తమ నుంచి లాక్కున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే సీఎం ఆదేశాలతో అధికారులు ఆగమేఘాల మీద స్పందించిన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ భూ ఆక్రమణలు నిజమేనని తేల్చారు. ఈ మేరకు నివేదిక కూడా ఇచ్చారు. విజిలెన్స్‌ విచారణ సోమవారం పూర్తి కానుంది. విజిలెన్స్‌ విచారణ అనంతరం రాజేందర్‌ విషయంలో మరిన్ని పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు సమాచారం.

మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే భూ కబ్జాను నిర్ధారించడంతో ఆయనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కబ్జాతోపాటు బెదిరింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని సమాచారం. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మాజీ మంత్రిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కబ్జా భూముల్లో ఉన్న చెట్లు నరికినందున ఫారెస్టు కన్జర్వేషన్‌ యాక్ట్, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం, అందులో నిర్మాణాలు, రోడ్డు నిర్మాణాలు చేపట్టడంపై కూడా రాజేందర్‌పై కేసులు నమోదవుతాయని సమాచారం. కేవలం మాసాయిపేట మండలమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజేందర్‌ ఆస్తులపై ప్రభుత్వం ఆరా తీస్తోందని తెలిసింది.

చదవండి: ‘ఈటల కబ్జా భూములను స్వాధీనం చేసుకుంటాం’

>
మరిన్ని వార్తలు