Etela Rajender: ఈటల సంస్థకు నోటీసులు.. 16 నుం‍చి 18 వరకు భూసర్వే

9 Nov, 2021 02:09 IST|Sakshi

జమునా హేచరీస్‌ భూముల సర్వేకు అధికారుల నిర్ణయం

రాజేందర్‌ భార్య, కుమారుడు సహా 154 మంది రైతులకు నోటీసులు

16, 18 తేదీల్లో సర్వే ప్రదేశానికి హాజరుకావాలని ఆదేశం  

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణల విచారణలో కదలిక వచ్చింది. జమునా హేచరీస్‌కు సంబంధించిన భూములను సర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 16, 18 తేదీల్లో నిర్వహించనున్న సర్వేకు సంబంధించి నిర్ణీత ప్రదేశానికి హాజరు కావాలని ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్‌రెడ్డిలతోపాటు సంబంధిత భూములున్న 154 మంది రైతులకు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల శాఖ తూప్రాన్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీసుజాత సోమవారం నోటీసులు జారీ చేశారు.

మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్‌ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 130, 77, 78, 79, 80, 81, 82తోపాటు హకీంపేట్‌ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 97 పరిధిలోని భూములపై సర్వే నిర్వహిస్తున్నట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ భూముల సర్వే కోసం ఈ ఏడాది మేలో జారీ చేసిన నోటీసులకు కొనసాగింపుగా మరోమారు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 

66 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉందని ప్రాథమిక నివేదిక.. 
ఈటల తమ భూములను కబ్జా చేశారంటూ కొందరు రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంతో దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. తక్షణమే విచారణ చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. భూ ఆక్రమణలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఏసీబీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలకూ ఆదేశాలు జారీ చేసింది. అటవీశాఖ కూడా తమ భూములు ఏమైనా ఆక్రమణకు గురయ్యాయా అనే దానిపై విచారణ చేపట్టింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులు సర్వే, విచారణ చేపట్టగా జమున హేచరీస్‌లో 66 ఎకరాల అసైన్డ్, సీలింగ్‌ భూములున్నాయని మెదక్‌ కలెక్టర్‌ అప్పట్లో ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఈ భూముల్లో షెడ్లు, రోడ్లు, భవనాలు నిర్మించారని, చెట్లు నరికారని పేర్కొన్నారు. 

మేలో జరగాల్సిన సర్వే..  
జమునా హేచరీస్‌ సంస్థ అసైన్డ్, సీలింగ్‌ భూ ములను ఆక్రమించిందనే ఆరోపణలపై మెదక్‌ జిల్లా అధికారులు ఈ ఏడాది మేలో సర్వే చేపట్టారు. దీనిపై జమున హేచరీస్‌ హైకోర్టును ఆశ్రయించగా కోవిడ్‌ వ్యాప్తి తగ్గాక నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి సర్వే చేపట్టాలని  ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కోవిడ్‌ వ్యాప్తి తగ్గడంతో ఈ భూములను సర్వే చేయాలని నిర్ణయించినట్లు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.హరీశ్‌ సోమవారం తెలిపారు. అసైన్డ్, సీలింగ్‌ భూములు ఎంత మేరకు ఆక్రమణలకు గురయ్యాయనే దానిపై ఈ సర్వేలో తేలుతుందన్నారు. 

>
మరిన్ని వార్తలు