Aasara Pension: 30 వరకు పింఛన్ల దరఖాస్తుకు అవకాశం  

11 Oct, 2021 02:29 IST|Sakshi

మీ సేవ, ఈ సేవల్లో సేవల రుసుము తీసుకోవద్దు: మంత్రి ఎర్రబెల్లి 

సాక్షి, హైదరాబాద్‌: వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. ఈ ఆసరా పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరంభించింది. గత ఆగస్టు 31 నాటికే కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినా, అర్హులందరికీ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నెల 11 నుండి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా కలెక్టర్లకు, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

అర్హులైనవారు ఈ నెల 11 నుంచి ఈసేవ, మీసేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ఈనెల 30 వరకు అందిన దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని, సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పుట్టినతేదీ ధ్రువీకరణ, ఓటర్‌ కార్డు తదితర పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేయాలన్నారు. కాగా, ఈ దరఖాస్తులకు ఈ సేవ, మీ సేవల్లో సేవల రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుములను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.    

మరిన్ని వార్తలు