సైనిక లాంఛనాలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ అంత్యక్రియలు

19 Mar, 2023 02:44 IST|Sakshi

 వినయ్‌భానురెడ్డికి బొమ్మలరామారంలో అంతిమ సంస్కారాలు 

వ్యవసాయక్షేత్రంలో వినయ్‌ చితికి నిప్పంటించిన తండ్రి, కూతురు 

హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు 

సాక్షి, యాదాద్రి/మల్కాజిగిరి/సాక్షి, హైదరాబాద్‌: అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడు రోజుల క్రితం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఉప్పల     వినయ్‌భానురెడ్డి (వీవీబీరెడ్డి) అంత్యక్రియలు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో జరిగాయి. భానురెడ్డి తల్లిదండ్రులు, భార్య, కూతుళ్లు, బంధువులు, గ్రామస్తులు, ఆర్మీ అధికారులు, ప్రజాప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

వినయ్‌భానురెడ్డి తండ్రి నర్సింహారెడ్డి, కూతు రు హనిక.. చితికి నిప్పంటించారు.  సైనికులు గాల్లోకి మూ డు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. ఆరీ్మకి చెందిన కల్నల్‌ మనీశ్‌ దేవగణ్‌ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. వినయ్‌ భార్య స్పందనారెడ్డి భారత సైన్యంలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలోని వినయ్‌భానురెడ్డి ఇంటి నుంచి ఆయన పార్థివ దేహాన్ని శనివారం ఉదయం సైనిక వాహనంలో స్వగ్రామం బొమ్మలరామారానికి తీసుకువచ్చారు.  

ప్రముఖుల నివాళి:  వినయ్‌భానురెడ్డి పార్థివదేహాన్ని బొమ్మలరామారంలోని ఆయన ఇంటికి తీసుకువచ్చి గంటపాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు. అంతకు ముందు మల్కాజిగిరి నివాసంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే, సదరన్‌ కమాండ్‌ జనరల్‌ ఆఫీస్‌ కమాండింగ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎ.కె.సింగ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆయనకు నివాళులర్పిం చారు.

బొమ్మలరామారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రాచకొండ సీపీ దేవేంద్రసింగ్‌ చౌహాన్, యాదాద్రి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, డీసీపీ రాజేశ్‌చంద్ర తదితరులు వినయ్‌భానురెడ్డికి నివాళులర్పిం చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.  

ప్రభుత్వం అండగా నిలవాలి: ఎంపీ కోమటిరెడ్డి  
దేశం కోసం విధులు నిర్వహిస్తూ.. ప్రాణాలు విడిచిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ వినయ్‌ భానురెడ్డి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 50 లక్షల ఎగ్స్‌గ్రేషియా ఇవ్వాలని శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు