IBS Ragging: ఐబీఎస్‌ కాలేజ్‌ ర్యాగింగ్‌ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

13 Nov, 2022 15:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం రేపిన ఐబీఎస్‌ కళాశాల ర్యాగింగ్‌ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి.  ఓ మతాన్ని కించపరుస్తూ బాధిత విద్యార్ధి సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ గొడవ మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు శంకర్‌పల్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అయిదుగురిని అరెస్ట్‌ చేయగా.. మరో అయిదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహ్మద్‌ ఇమాద్‌, సోహైల్‌, వర్షిత్‌, గణేష్‌, వాసుదేవ్‌ వర్మ నే విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఇంత జరిగిన నిర్లక్ష్యంగా వ్యవహరించినా కాలేజీ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేశారు. కాగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లి శివారులోని ఇక్ఫాయి(ఐబీఎస్‌) కళాశాలలో విద్యార్థి హిమాంక్‌ బన్సాల్‌పై సీనియర్లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీన జరిగిన ర్యాగింగ్‌ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక్క విద్యార్థిని లక్ష్యంగా చేసుకొని దాదాపు 10 మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. హాస్టల్‌ గధిలో బంధించి బాధితుడిపై కూర్చొని, పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా గాయపరిచారు.

ఈ దృశ్యాలను వీడియో తీయగా.. బాధిత విద్యార్థి దీనిని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కళాశాల యాజమాన్యం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దాడికి పాల్పడిన 12 మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది.

కారణం అదేనా!
అయితే ఐసీఎఫ్‌ఏఐ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ అబ్బాయి, అమ్మాయి చాటింగ్‌ చేసుకున్నారు. కొంతకాలం లవ్‌ చేసుకున్నాక వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.  దీంతో యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని అవమానిస్తూ పోస్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తన బంధువైన సీనియర్‌ విద్యార్థికి చెప్పింది. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. అతడు తన స్నేహితులను వెంటబెట్టుకుని హాస్టల్‌లో ఉన్న యువకుడిపై దాడి చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ 15 నుంచి 20 మంది సీనియర్లు తన హాస్టల్ గదిలోకి చొరబడి కొట్టారని బన్సల్ ఫిర్యాదులో పేర్కొన్నారు

మరిన్ని వార్తలు