లక్ష్మణుడు..అందరి ఆప్తుడు

3 Aug, 2020 08:02 IST|Sakshi

చుట్టూ ఉన్న వారి బాధ్యతలు తనవే 

ఆపత్కాలంలో ఆత్మబంధువు 

కష్టాల్లో ఉన్నవారికి తోబుట్టువులా సేవ 

సాక్షి,సిటీబ్యూరో: పెద్ద ఉమ్మడి కుటుంబం, ఎంత పని చేసినా సమయం చాలని వ్యాపార సమూహం, కాలక్షేపానికి బోలెడు మంది స్నేహితులు..అన్నీ ఉన్నా ఏదో వెళితి అతడిని వెంటాడింది..అన్ని పనులు చేస్తున్నా ఎక్కడో తెలియని అసంతృప్తి ఆయనలో మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో సమాజం నుంచి ఎప్పుడూ తీసుకోటమే కాదు, సమాజానికి మనమూ ఇవ్వాలన్న ఆలోచనతో బీఎల్‌ఆర్‌(బండారి లక్ష్మారెడ్డి ఛారిటబుల్‌ ట్రస్ట్‌) ఏర్పాటు చేశాడు. గత ఐదేళ్లుగా తన చుట్టూ ఉన్న వారు కన్నీళ్లు, కష్టాలు ఎదుర్కోకూడదన్న లక్ష్యంతో ప్రతి నెల ఐదు రోజులు పూర్తిగా స్వచ్చంద సేవకోసం కేటాయిస్తున్నారు బండారి లక్ష్మారెడ్డి. ఇబ్బందుల్లో ఉన్నవారు తన వద్దకు రావటం కంటే తానే చుట్టూ ఉన్న సమూహాల్లో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారి వద్దకే వెళ్లి ఓ తోబుట్టువులా స్నేహితుడిలా ఓదార్చి వారి జీవితాలు మళ్లీ గాడిన పడేందుకు అవసరమైన సహాయం చేస్తున్న తీరు అందరి మన్ననలు పొందుతోంది. 

ఎంప్లాయిమెంట్‌తో మొదలై: ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం, ఉపాధి వేటలో కుదేలైన వారి కోసం ఆయన ఐదేళ్ల క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంప్లాయిమెంట్‌ గైడెన్స్‌ మేళాలు నిర్వహించారు. ఎంతోమంది నిరుద్యోగ యువతకు తన స్నేహితుల కంపెనీల్లో అవకాశాలిప్పించటంతో పాటు పలువురికి పోలీస్‌ ఉద్యోగాల కోసం రెండు నెలల పాటు ప్రత్యేక క్యాంప్‌నే నిర్వహించారు. ఇందులో తొమ్మిది మంది మెరిట్‌ జాబితాలో ఉద్యోగం సంపాదించుకున్నారు. ప్రస్తుతం వారు కూడా ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతకు గైడెన్స్‌ ఇస్తుండటం విశేషం. 

ఆపత్కాలంలో అన్నీ తానై..
కోవిడ్‌ మహమ్మారి విస్తరణ నేపథ్యంలో కార్మికులు, నిరుపేదలను ఆదుకునేందుకు బీఎల్‌ఆర్‌ ట్రస్ట్‌ అన్నీ తానై ముందుకు వచ్చింది. కరోనా నియంత్రణపై అవగాహన కల్పించడమేగాక, కార్మికులకు అవసరమైన పీపీఈ కిట్ల పంపిణీ, కాలనీల్లో రోజూ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ మందుల పిచికారీ, వైరస్‌ బారిన పడిన వారికి పౌష్టికాహారం పంపిణీ చేస్తూ వారు కోలుకునేందుకు  ట్రస్ట్‌ వలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇవే కాకుండా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన  వారికి గత ఐదు నెలలుగా నిత్యావసర కిట్లను అందజేస్తున్నారు. ఈ విషయమై లక్ష్మారెడ్డిని కదిలిస్తే..’’అపదలో ఉన్న వారికి అండగా ఉండేందుకు తోబుట్టువులే అయి ఉండాల్సిన అవసరం లేదు.. అన్ని మార్గాలు మూసుకుపోయిన వారికి కొత్తదారిని చూపేందుకు స్నేహితుడే కావాల్సిన అవసరం లేదు. నా కిచ్చిన శక్తిని సమాజంలో మంచి కోసం ఉపయోగిస్తున్నా..అందులో గొప్పేం లేదు’’ అని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు