ఎమ్మెల్సీ అభ్యర్థులు..కోటీశ్వరులు!

25 Feb, 2021 09:31 IST|Sakshi

గులాబీ పార్టీ అభ్యర్థి పల్లా ఆస్తుల విలువ రూ.31.70 కోట్లు

సొంత కారు కూడా లేదని అఫిడవిట్‌

బీజేపీ అభ్యర్థికి రూ.3.72 కోట్ల ఆస్తి

ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆస్తి రూ.2.06కోట్లు

సీపీఐ అభ్యర్థి జయసారథిరెడ్డిది మాత్రం రూ.లక్షల్లోనే

తేటతెల్లం చేస్తున్న ఎన్నికల అఫిడవిట్‌లు

సాక్షి, నల్లగొండ: శాసనమండలి నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కోటీశ్వరులే. నామినేషన్ల దాఖలు సందర్భంగా వీరు సమర్పించిన అఫిడవిట్లు అదే తేలుస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వీరి చదువు, ఆస్తిపాస్తులు, కేసుల వివరాలు ఉన్న అఫిడవిట్లను తన వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి స్థిర, చరాస్తులు అన్నీ కలిపి రూ.31.70 కోట్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి డాక్టర్‌ చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ అభ్యర్ధి రాణి రుద్రమ, తెలంగాణ జన సమితి అభ్యర్థి ప్రొఫెసర్‌ కోదండరామ్, తదితర అభ్యర్థులందరికీ రూ. రెండు కోట్లు ఆపైననే ఆస్తులు ఉన్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు రూ.2కోట్ల లోపు ఆస్తులు ఉండగా, సీపీఐ అభ్యర్ధి జయ సారథిరెడ్డికి కేవలం రూ.లక్షల్లోనే ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇక, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సొంతకారు కూడా లేకపోవడం విశేషం. 

నల్లగొండ ప్రేమేందర్‌రెడ్డికి రూ.3.72 కోట్ల ఆస్తులు 
బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డికి రూ.3,72,55,207 విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.2,09,05,207 చరాస్తి కాగా, రూ.1,63,50,000లు స్థిరాస్తిగా చూపించారు.  వరంగల్‌ అర్బన్‌ జిల్లా దామెరలో 13 ఎకరాల భూమి ఉంది. బీమారంలో తిరుమల సర్వీస్‌ సెంటర్‌ పేరుతో కమర్షియల్‌ బిల్డింగ్‌ ఉంది. ఆయనకు ఒక ఇన్నోవా వాహనంతోపాటు, అశోక్‌ లేల్యాండ్‌ ట్యాంకర్‌ ఒకటి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రూ.18.84లక్షల రొక్కం ఉందని, బ్యాంకులో డిపాజిట్ల రూపంలో మరో రూ.28 లక్షలు ఉన్నాయని, భార్యచేతిలో రూ.4.59లక్షల నగదు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పుల రూపంలో రూ.86.79లక్షల ఓడీ లోన్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. 

పల్లా  అప్పులు రూ.4.10కోట్లు
ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న స్థిర, చరాస్తుల విలువ రూ.31,70,92,030. కాగా, ఇందులో చరాస్తులు విలువ రూ.13,15,98,390, స్థిరాస్తుల విలువ రూ.18,54,93,640గా పేర్కొన్నారు. ఇక, ఆయనకు  సొంత కారు కూడా లేదు. కానీ, పల్లా భార్య పేరు మీద ఒక కారు (మారుతీ సెలిరీయో 2017 మోడల్‌) ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించారు. ఇక ఆయనకు ఉన్న అప్పులు  రూ.4,10,17,703. పల్లాకు వారసత్వంగా నాలుగు ఎకరాల భూమి రాగా, ఆయన తన సంపాదన నుంచి మరికొంత భూమి కొనుగోలు చేశారు. మొత్తంగా ఆయన పేరున 32.10 ఎకరాలు, ఆయన భార్య పేరున 10.27 ఎకరాలు, కుటుంబ సభ్యుల పేరు మీద 41.39 ఎకరాల భూములు ఉన్నాయి. 

రాణిరుద్రమ:
యువ తెలంగాణ పార్టీ (వైటీపీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఆ పార్టీ అభ్యర్థి జి.రాణి రుద్రమకు రూ. 3,98,86,700 ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ. 58,06,700 చరాస్తి  రూ.3,40,80,000 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆమెకు రూ.42.98లక్షల విలువైన 89 తులాల బంగారు నగలు, రూ.1.08లక్షల విలువైన. కేజిన్నర వెండి ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.


 


ప్రొఫెసర్‌ కోదండరామ్‌:
తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి కూడా అయిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు రూ.2,06,95,099 విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.52,75,099 విలువైన చరాస్తి, రూ.1,54,20,000 విలువైన స్థిరాస్తి ఉంది. అంతే కాకుండా ఆయన పేరు మంచిర్యాలలో ఒక కమర్షియల్‌ గోదాము కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. కోదండరామ్‌కు, ఆయన భార్యకు చెరో వాహనం ఉంది. 


సీపీఐ అభ్యర్థి జయ సారథిరెడ్డి:
ఈయన పేరున రూ.4.08లక్షల చరాస్తి ఉండగా, ఆయన భార్యపేరున రూ.37.75లక్షల విలువైన చరా స్తి మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. సొంతంగా కొనుగోలు చేసిన స్థిరాస్తి రూ.15.95లక్షల విలువగలది ఆయన పేరున, రూ.33.88లక్షల విలువగల ఆస్తి భార్య పేరు ఉంది.

కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌:
ఈయనకు రూ.1.88 కోట్ల ఆస్తులు ఉన్నా యి. ఇందులో చరాస్తులు రూ.40,71,305లు కాగా, స్థిరా స్తులు రూ.1,47,61,580గా పేర్కొన్నారు. మొత్తంగా ఆయనకు  రూ.1,8 8,32,885 విలువైన ఆస్తులు ఉండగా.. రూ.16,42,764 అప్పులున్నా యి. ఒక ఇన్నోవా కార్‌ కూడా ఉంది. ఇక, ఆయన భార్యకు  రూ.4లక్షల విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. తెలంగాణ ఇంటిపార్టీ (టీఐపీ) అధ్యక్షుడు, ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ చెరుకు సుధాకర్‌కు రూ.3. 37కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.7 లక్షల విలువైన చరాస్తి, రూ.3.30కోట్ల విలువైన స్థిరాస్తి ఉంది.

మరిన్ని వార్తలు