ప్రముఖ రచయిత దేవిప్రియ కన్నుమూత

22 Nov, 2020 03:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: శ్రమజీవుల దోపిడీ..అట్టడుగు వర్గాల కన్నీళ్లు, కష్టాలకు అక్షర రూపమిచ్చి... జీవితమంతా తిరుగుబావుటాగా రెపరెపలాడిన ప్రముఖ రచయిత, జర్నలిస్టు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ (71) శనివారం ఉదయం మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పది రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తాడికొండలో పుట్టిన ఆయనకు తల్లిదండ్రులు షేక్‌ ఖాజా హుస్సేన్‌గా పేరుపెట్టగా... ఆయన తన ఊరిపేరునే ఇంటి పేరుగా మార్చుకుని తాడి కొండ దేవిప్రియ పేరుతో పాటలు, కథలు, ఇతర రచనలు చేసి విశేష ప్రాచుర్యం పొందారు.

పలు సినిమాలకు స్క్రీన్‌ ప్లేతో పాటు పాటలు రాశారు. దేవిప్రియ భార్య రాజ్యలక్ష్మి ఆరేళ్ల క్రితమే మరణించగా, కుమారుడు ఇవ, కూతురు సమతలు ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని అల్వాల్‌లోని నివాసానికి తీసుకువెళ్లి... అనంతరం తిరుమలగిరి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్, రచయితలు శివారెడ్డి, సిద్ధారెడ్డి, దర్శకుడు బి.నర్సింగరావు, కెఆర్‌ మూర్తి తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళి అర్పించారు. 


బహుముఖ ప్రజ్ఞాశాలి  
కవి, రచయిత, వ్యంగ్య వ్యాఖ్యానంతో పాటు సినిమా పాటలు, స్క్రీన్‌ప్లే తదితర రంగాల్లో దేవిప్రియ బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు. ‘రన్నింగ్‌ కామెంట్రీ’పేరుతో దినపత్రికల్లో రాజకీయనాయకులపై నిత్య వ్యంగ్య వ్యాఖ్యాన ప్రక్రియను ప్రారంభించింది ఈయనే. ‘సంతకాలు’మరొక శీర్షిక. బి.నర్సింగరావు ఆధ్వర్యంలో వచ్చిన రంగులకల సినిమాలో ‘ఝమ్‌ ఝమ్మల్‌ మర్రీ, వెయ్యికాళ్ల జెర్రీ’అంటూ జనాన్ని ఉర్రూతలూగించిన గేయం దేవిప్రియ రాసిందే. గద్దర్‌ దీన్ని పాడారు. మా భూమి, దాసి సినిమాలకు స్క్రీన్‌ప్లే, పాటలు రాశారు. రగులుతున్న భారతం సినిమాకు మాటలు, పాటలు రాశారు. వీటిలో ‘గుర్తుందా నీకు’పాట మరపురానిది.

గుంటూరు ఏసీ కళాశాలలో చదివిన ఆయన 1970లో ఏర్పడిన పైగంబర కవులలో సభ్యునిగా అమ్మచెట్టు, నీటిపుట్ట, చేప చిలుక, తుపాన్‌ తుమ్మెద, అరణ్య పర్వం, గాలి రంగు తదితర కవితా సంపుటిలతో పాటు ఇన్షా అల్లా పేరుతో కంద పద్యాలు రాశారు. గాలి రంగు కవితా సంకలనానికే కేంద్రసాహిత్య అకాడమీ (2017) పురస్కారం లభించింది. ఏపీ ప్రభుత్వం హంస పురస్కారం (2015), తెలుగు యూనివర్సిటీ పురస్కారం (2016), కెఎన్‌వై పతంజలి అవార్డు(2017), గజ్జెల మల్లారెడ్డి స్మారక అవార్డు (2011), యూనిసెఫ్‌ పురస్కారం(2011), విశాలాక్షీ సాహితీ పురస్కారం(2009) దేవిప్రియను వరించాయి.

శ్రీశ్రీతో ఆయన ఆత్మ చరిత ‘అనంతం’ను రాయించి, సీరియల్‌గా ప్రచురించారు. అప్పట్లో అదొక సంచలనం. పెద్ద చర్చకు దారితీసింది. శ్రీశ్రీతో ఆ సీరియల్‌ రాయించేందుకు ‘పీత కష్టాలు’పడ్డానని దేవీప్రియ ఒక సందర్భంలో చెప్పారు. ప్రజావాగ్గేయకారుడు గద్దర్‌ జీవితాన్ని ‘యుద్ధనౌక’గా డాక్యుమెంటరీ చేశారు. దేవిప్రియ మరణంపై ప్రజాసాహితి సంపాదకులు కొత్తపల్లి రవిబాబు, జనసాహితి అధ్యక్షులు దివి కుమార్‌లతో పాటు ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ సంతాపాన్ని ప్రకటించింది.

పలువురి సంతాపం 
ప్రముఖ సాహితీవేత్త, సీనియర్‌ జర్నలిస్ట్‌ దేవిప్రియ (షేక్‌ ఖాజా హుస్సేన్‌) అనారోగ్యంతో మృతి చెందడం పట్ల ప్రముఖ కవి, రచయిత నిఖిలేశ్వర్‌తో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించి, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేవిప్రియ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటని సాహితీ సమితి ప్రతినిధులు తెలకపల్లి రవి, వరప్రసాద్, కె.సత్యరంజన్‌ సంతాపం తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించిన దేవిప్రియ పలు పత్రికల్లో పనిచేయడంతో పాటు సందేశాత్మక, అభ్యుదయ రచనలు చేశారని, దాసి, రంగుల కల సినిమాలకు పనిచేశారని సీపీఎం రాష్ట్ర కమిటీ నివాళులర్పించింది.  

సామాజిక చైతన్యానికి కృషి చేశారు: సీఎం కేసీఆర్‌ 
ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేవిప్రియ సాహిత్య ప్రతిభకు ‘గాలి రంగు’రచన మచ్చు తునక అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

సాహితీ రంగానికి తీరని లోటు: హరీశ్‌రావు 
దేవిప్రియ మరణం సాహితీ రంగానికి తీరని లోటని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సంతాపం ప్రకటించారు. మెతుకు సీమతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంజీరా రచయితల సంఘం నిర్వహించిన పలు సభల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. దేవిప్రియ సామాజిక చైతన్యం కోసం కృషి చేశారని హరీశ్‌రావు నివాళి అర్పించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా దేవీప్రియ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

మరిన్ని వార్తలు