రఘురాం అంకితభావం.. ఆదర్శం

8 Sep, 2020 10:56 IST|Sakshi
సీఎం కేసీఆర్‌ను కలిసిన రఘురాం (ఫైల్‌)  

సాక్షి, జడ్చర్ల: విధి నిర్వహణలో అంకితభావం.. దానికి తోడు సేవాదృక్పథం కలిగి ఉండటంతో రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యాడు జడ్చర్ల ప్రభుత్వ కో ఎడ్యుకేషన్‌ కళాశాల అధ్యాపకుడు రఘురాం. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరి చిత్రా రామచంద్రన్‌ ప్రకటించిన ఉత్తమ అధ్యాపకుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. కరోనా పరిస్థితులతో అవార్డును డీఐఓ ద్వారా నేరుగా కళాశాలకు పంపించి అందజేయనున్నారు.  

ఉమ్మడి జిల్లాల ఒక్కరికే అవకాశం.. 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక్కరికే వచ్చిన ఈ అవార్డు త్వరలోనే రఘురాం అందుకోనున్నారు. మహబూబ్‌నగర్‌ ఎన్టీఆర్‌ ఉమెన్స్‌ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న జడ్చర్ల అనంతరామయ్య 2005లో అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతితో కారుణ్య నియామకం ద్వారా ఆయన కుమారుడు రఘురాం ఎల్‌డీసీగా వంగూరులో ఉద్యోగంలో చేరారు. తిమ్మాజిపేటలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసి 2014లో ఖిల్లాఘనపూర్‌ కళాశాలకు పదోన్నతిలో లెక్చరర్‌గా బదిలీపై వెళ్లారు. 2018 జూన్‌లో జడ్చర్ల ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలకు బదిలీపై వచ్చారు. బదిలీపై వచ్చిన సమయంలో కళాశాలలో కేవలం 75మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 375కు చేరింది.   

స్పందించిన ఎమ్మెల్యే.. 
కో ఎడ్యుకేషన్‌ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన అధ్యాపకుడు రఘురాం సేవలతో స్పందించిన జడ్చర్ల ఎమ్మెల్యే డా. లక్ష్మారెడ్డి ప్రభుత్వ బాలికల కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. ఆయన సొంత ఖర్చులతో భోజన వసతి కల్పించారు.  

మధ్యాహ్న భోజనానికి రాష్ట్రవ్యాప్త అమలుకు శ్రీకారం.. 
జూలై 17వ తేదిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జడ్చర్ల బొటానికల్‌ గార్డెన్‌ నిర్వాహకుడు వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.సదాశివయ్యతో కలసి సీఎం కేసీఆర్‌ను రఘురాం కలిశారు.  దీంతో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు బాగున్నాయని  సీఎం కేసీఆర్‌ అభినందించారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న బోజనం ఆవశ్యకత ఉందని గ్రహించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయిస్తానని ప్రకటించారు.   

నాన్న స్ఫూర్తితోనే.. 
నాన్న ఆశయాల సాధనకోసమే సేవ చేయాలని తలంచాను. జడ్చర్ల కళాశాలకు మంచి  పేరు తీసుకురావాలని సంకల్పించి మధ్యాహ్న భోజనం, యూనిఫాంలను ఉచితంగా అందించాను. తోటి అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌ సహకారంతో ముందుకెళ్తున్నాం. నా సేవలకు గుర్తింపుగా వచ్చిన ఈ అవార్డు మా నాన్నకే అంకితం. 
– రఘురాం, గణిత అధ్యాపకుడు, జడ్చర్ల కో ఎడ్యుకేషన్‌ కళాశాల

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా