నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు గండి

8 Sep, 2022 02:00 IST|Sakshi

కెనాల్‌ 32.109 కి.మీ వద్ద మొదట బుంగ పడి గండిగా మారింది

కాలువ ఆధునీకరణ తర్వాత ఇదే మొదటిసారి.. కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపైకి వచ్చిన నీరు

సాక్షి, నిడమనూరు: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం–వేంపాడ్‌ గ్రామాల మధ్య నారెళ్లగూడ మేజర్‌ సమీపంలో నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కట్టకు బుధవారం భారీ గండి పడింది. సాయంత్రం 5.45 గం.కు యూటీ వద్ద నీరు కాల్వ లో సుడి తిరుగుతూ ఉండటం, కట్టకు కింది భాగంలోంచి నీరు అధికంగా వెళ్తుండటం గమనించారు. మొదట అయోమయానికి గురైన రైతులు, తర్వాత బుంగ పడిందని నిర్ధారణ చేసుకున్నారు. సాగర్‌ ఎడమ కాల్వకు 32.109 కిలోమీటర్‌ వద్ద ఉన్న యూటీకి (అండర్‌ టన్నెల్‌) కుడి పక్కన గండి పడి తర్వాత మొత్తం కొట్టుకుపోయింది. బుంగ కాస్తా పెరిగి గంటలోనే కట్టకు గండిపడింది. కట్ట 30 మీటర్ల మేర కొట్టుకు పోయింది. సాగర్‌ నుంచి వచ్చే నీరంతా పొలాలకు నర్సింహులగూడెం మీదుగా, నిడమనూరు సమీపంలోని వాగులోకి చేరాయి. వాగు ద్వారా నీరు వెళ్తుండటంతో నిడమనూరుకు ముప్పు తప్పింది. గండి పడిన ప్రాంతానికి తహశీల్దార్‌ ప్రమీల, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు వెళ్లి పరిశీలించారు. పూర్తిగా చీకటిపడటంతో ఎక్కడ ఎంత మేర గండి పడిందో అంచనా వేయలేకపోతున్నారు. విషయం తెలుకున్న సాగర్‌ ప్రాజెక్టు అధికారులు నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు బుధవారం రాత్రి నీటిని నిలిపివేశారు. నిడమనూరు–నర్సింహులగూడెం మధ్య కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపైకి నీరు రావడంతో ఒక పక్కనే రాకపోకలకు అనుమతిస్తున్నారు. 

ఆధునీకరణకు ముందు రెండు చోట్ల గండ్లు 
సాగర్‌ ఎడమకాల్వ కట్టకు ఆధునీకరణకు ముందు గండ్లుపడిన సందర్భాలున్నాయి. నిడమనూరు మండలం బీకే పహాడ్‌ సమీపంలోని వెంగన్నగూడెం మైనర్‌ తూము వద్ద, హాలియా మండలం ఇబ్రహీంపేట గ్రామం వద్ద కాల్వకట్టకు గండి పడింది. అప్పుడూ వ్యవసాయ పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాగర్‌ ఎడమకాల్వకు ఆధునీకరణ పనులు చేపట్టిన తర్వాత గండి పడటం మాత్రం ఇదే మొదటిసారి. కట్టబలోపేతం చేయడం వల్ల కట్టకు ఇబ్బంది లేకున్నా యూటీలను ఆధునీకరించకపోవడం వల్లే గండిపడింది.

ఇదీ చదవండి: సరి లేదు ‘వరి’కేదీ!.. రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్‌ స్థాయిలో నాట్లు

మరిన్ని వార్తలు