విద్యుత్‌ చట్ట సవరణలు వెంటనే ఉపసంహరించుకోవాలి 

29 Aug, 2020 03:00 IST|Sakshi
శుక్రవారం విద్యుత్‌ అమర వీరుల సంస్మరణ సభలో మాట్లాడుతున్న సీపీఐ నేత నారాయణ. చిత్రంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర వామపక్షాల నేతలు 

కేంద్ర ప్రభుత్వానికి లెఫ్ట్‌ నేతల డిమాండ్‌ 

విద్యుత్‌ ఉద్యమ అమరులకు నివాళులు 

సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ

సాక్షి, హైదరాబాద్‌: ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా తీసుకువస్తున్న విద్యుత్‌ చట్ట సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ వామపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. ప్రజలకు నష్టం చేసే ఈ సవరణలను వెనక్కు తీసుకోకపోతే గతంలో విద్యుత్‌ ఉద్యమ షాక్‌ తగిలి ఏపీ ప్రభుత్వం కూలిపోయిన మాదిరిగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా షాక్‌ తగులుతుందని హెచ్చరించారు. కేంద్రం విద్యుత్‌ బిల్లును వెంటనే ఉపసంహరించుకోకపోతే విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో మరో ఉద్యమాన్ని చేపడతామని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని షహీద్‌చౌక్‌ వద్ద విద్యుత్‌ ఉద్యమ అమరులు బాలాస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌లకు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అమరవీరుల 21వ సంస్మరణ సభలో కేంద్ర విద్యుత్‌ చట్టాల సవరణకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.

గతంలో జరిగిన ‘బషీర్‌బాగ్‌ విద్యుత్‌ ఉద్యమం’మహత్తరమైన ఉద్యమమని, ఆ ఉద్యమం కారణంగానే ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు విద్యుత్‌ చార్జీలను పెంచే సాహసం చేయలేదని, పైగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ తదితర సదుపాయాలను కల్పించాయని వక్తలు పేర్కొ న్నారు. ఒకే దేశం–ఒకే పన్ను తదితర నినాదాలతో బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా చట్టాలను సవరిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తోందని, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ముందుకు రావాలని సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి కోరారు. నాడు ప్రపంచ బ్యాంకు విధానాల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలను అమలు చేసిందని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంతకంటే ఉధృతంగా ప్రపంచ బ్యాంకు, పెట్టుబడిదారీ విధానాలను అమలు చేస్తోందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కార్యక్రమంలో అజీజ్‌పాషా, పశ్య పద్మ (సీపీఐ), జి.నాగయ్య, డీజీ నరసింహారావు, బి.వెంకట్, టి.సాగర్‌ (సీపీఎం), ఎం.సుధాకర్‌ (ఎంసీపీఐ–యూ), కె. మురహరి (ఎస్‌యూసీఐ–సీ), అచ్యుత రామారావు, ఎస్‌.ఎల్‌.పద్మ (న్యూడెమోక్రసీ) తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు