Legendary Badminton Player Arjuna Pitchaiah: ‘అర్జున పిచ్చయ్య’ ఇక లేరు

27 Dec, 2021 02:43 IST|Sakshi
అర్జున అవార్డుతో పిచ్చయ్య 

అనారోగ్యంతో మనవడి ఇంట్లో కన్నుమూత 

బాల్‌ బ్యాడ్మింటన్‌లో అర్జున అవార్డు అందుకున్న పిచ్చయ్య 

అప్పట్నుంచే అర్జున పిచ్చయ్యగా ప్రాచుర్యం 

ఈ నెల 21న ఘనంగా 104వ జన్మదిన వేడుకలు 

వరంగల్‌ స్పోర్ట్స్‌: అవార్డునే ఇంటి పేరుగా మలుచుకున్న అర్జున పిచ్చయ్య ఇకలేరు. నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పిచ్చయ్య (104) ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం రాంపూర్‌ పరిధిలో గల ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలోని తన మనవడి (చిన్న కుమార్తె కొడుకు) ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన అసలు పేరు జమ్మలమడక పిచ్చయ్య. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 1918లో జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం బందరులో గడిచింది. క్రీడలపై ఉన్న అమితాసక్తి కారణంగా టెన్త్‌ ఫెయిల్‌ అయ్యారు.

పదిహేనేళ్ల వయసు వరకు ఫుట్‌బాల్‌ ఎక్కువగా ఆడేవారు. ఆ తర్వాత అన్నయ్య నారాయణరావు స్ఫూర్తితో బాల్‌ బ్యాడ్మింటన్‌ వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా ఆ క్రీడలో అర్జున అవార్డును అందుకునే స్థాయికి ఎదిగారు. 1970లో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించగా.. 1972లో అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా స్వీకరించారు.

ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా స్పోర్ట్స్‌ కోటాలో ఆజంజాహి మిల్లులో ఉద్యోగం కోసం 1947లో వరంగల్‌కు వచ్చిన పిచ్చయ్య ఇక్కడే స్థిరపడిపోయారు. ఈనెల 21న పిచ్చయ్య 104వ జన్మదిన వేడుకలు పలువురు క్రీడ, ఇతర ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఆ రోజు అందరితో ఉత్సాహంగా మాట్లాడిన ఆయన ఆ తర్వాత జ్వరంతో బాధపడుతూ మంచం పట్టి ఆదివారం కన్ను మూశారు. పిచ్చయ్యకు  ఇద్దరు కుమార్తెలు కాగా, భార్య సత్యవతి 2007లో మరణించారు.

మరిన్ని వార్తలు