స్రవంతి ఇక లేదు..

10 Jan, 2021 07:06 IST|Sakshi

వరంగల్‌ జూ పార్కులో ఆడ చిరుత మృతి

కొద్దిరోజులుగా అనారోగ్యం, ఆపై అవయవాలు పనిచేయక కన్నుమూత

నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చిన అధికారులు

సాక్షి, న్యూశాయంపేట: వరంగల్‌ హంటర్‌రోడ్డులోని కాకతీయ జూలాజికల్‌ పార్క్‌లో తన గాండ్రింపులతో సందర్శకులను ఆకట్టుకున్న ఆడచిరుత స్రవంతి(17 సంవత్సరాల 11నెలలు) శనివారం మృతి చెందింది. కొన్ని రోజులుగా అనా రోగ్యంతో బాధపడుతున్న చిరుతకు వైద్యులు చికిత్స చేసినా ఫలితం కానరాక కన్నుమూసింది. వయస్సు పైబడడానికి తోడు అవయవాల పనితీరు మందగించడంతో చికిత్స అందించినా కోలుకోలేదని అధికారులు ప్రకటించారు. చదవండి: (కోడిపిల్లలు ఫ్రీ.. పరుగులు తీసిన జనం)

2003లో జననం..
2003 ఫిబ్రవరి 2న జన్మించిన ఆడ చిరుతను హైదరాబాద్‌ అత్తాపూర్‌లోని లాబోరేటరీ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఎన్‌డెసార్డ్‌ ఆఫ్‌ థీసిస్‌లో పెంపకానికి ఉంచారు. ఆ తర్వాత 2017 జనవరి నెలలో వరంగల్‌ కాకతీయ జూలాజికల్‌ పార్క్‌లో సందర్శకులకు కనువిందు చేయడానికి తీసుకొచ్చారు. దీనికి తోడుగా ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో దేవా పేరుతో ఉన్న మగ చిరుతను ఉంచారు. అయితే, సాధారణంగా 12 నుంచి 17 ఏళ్ల వరకే చిరుతలు జీవించనుండగా, స్రవంతికి ఇప్పటికే 17 ఏళ్ల 11 నెలల వయస్సు వచ్చింది.


చిరుత కళేబరం 
దీంతో జీవిత చరమాంకానికి చేరుకున్న చిరుత అవయవాల పనితీరు మందగించింది. ఈ మేరకు గత సంవత్సరం జూన్‌లోనే వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు లాబోరేటరీకీ పంపించినట్లు తెలిపారు. చిరుతకు కాలేయ సంబంధిత వ్యాధి, కిడ్నీలో లోపాలే కాకుండా హృదయ సంబంధిత ఇబ్బందులు ఉన్నాయని గుర్తించారు. అప్పటినుంచి చికిత్స అందిస్తుండగా, గత పదిహేను రోజులుగా ఆహారం తక్కువగా తీసుకుంటున్న స్రవంతి చివరికి ఆహారం తీసుకోలేని కారణంగా శనివారం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

జీవిత చరమాంకంలో ఉంది..
మనుషుల్లో మాదిరి జంతువులకు కూడా జీవిత చరమాంకంలో ఉన్నపుడు కొన్ని అవయవాలు పనిచేయవని జూపార్క్‌ వైద్యులు డాక్టర్‌ ప్రవీణ్, డాక్టర్‌ వంశీ తెలిపారు. అదే మాదిరి చిరుత స్రవంతికి కూడా 18 ఏళ్ల వయస్సు వస్తుండడంతో కిడ్నీ, కాలేయం, హృద్రోగ సంబంధిత వ్యాధుల బారిన పడిందని చెప్పారు. హైదరాబాద్‌ నెహ్రూ జులాజికల్‌ పార్క్‌ నుంచి డిప్యూడీ డైరెక్టర్‌ డాక్టర్‌ అహ్మద్‌ హకీం నేతృత్వంలో ప్రత్యేక బృందం వచ్చి వైద్యం చేసినా ఫలితం లేకపోయిందని తెలిపారు. చిరుత కళేబరానికి జిల్లా అటవీశాఖాధికారి డాక్టర్‌ రామలింగం పర్యవేక్షణలో శవపరీక్ష నిర్వహించి దహనం చేసినట్లు వారు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు