గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో చిరుత కలకలం

13 Dec, 2020 11:36 IST|Sakshi

గచ్చిబౌలిలోని రోడా మిస్త్రీ కాలేజీలో కుక్కను ఎత్తుకెళ్లిన వైనం

భయాందోళనలో స్థానికులు.. రంగంలోకి దిగిన అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ కారిడార్‌లోని జనారణ్యంలో చిరుత కలకలం రేపింది. ఒకవైపు ఐటీ కంపెనీలు, చెరువు, ఇంకోవైపు రద్దీగా ఉండే ప్రధాన రహదారి.. ఎటు వైపు నుంచి ఆ చిరుత వచ్చిందో ఫారెస్ట్‌ అధికారులకు కూడా పాలుపోవడం లేదు. వాటిన్నింటినీ దాటి ఓ కాలేజీలోకి చొరబడిన చిరుత ఓ కుక్కను ఎత్తుకెళ్లినట్లు రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్‌ అధికారులకు ఫిర్యాదు అందింది. గచ్చిబౌలిలోని రోడా మిస్త్రీ కాలేజ్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌లో శనివారం మధ్యాహ్నం సమయంలో ఓ చిరుత క్షణాల్లో పరుగున వచ్చి కుక్కను ఎత్తుకెళ్లింది.

సమీపంలోనే ఉన్న కాలేజీ స్వీపర్‌ కళావతి ఆ దృశ్యాన్ని చూసి భయంతో లోపలికి పరుగు తీసింది. ఇదంతా కాలేజీ సెక్రటరీ బీఎస్‌ రాజుతో చెప్పింది. కాలేజీ యాజమాన్యం రంగారెడ్డి జిల్లా డీఎఫ్‌ఓ భీమానాయక్‌కు సమాచారమివ్వడంతో చిలుకూరు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రతిమ కాలేజీని సందర్శించి భవనం మెట్లపై రక్తపు మరకలను గుర్తించారు. కాలేజీ భవనంపై నుంచి పక్కనే ఉన్న గుట్టలోకి అది దూకి ఉంటుందని భావిస్తున్నారు. కుక్క కనిపించడం లేదని, అధికసంఖ్యలో  కోతులు కూడా ఉన్నాయని అక్కడున్న వారు తెలిపారు. చదవండి: (అదిగో పులి..ఇదిగో లెక్క)

కెమెరాలు అమర్చుతాం..
అటవీ ప్రాంతం తక్కువ విస్తీర్ణంలో ఉన్న చోటుకు చిరుత రావడం అరుదు. కోతులు, కుక్కలను చిరుత వేటాడుతుంది. ఒక్కసారి వేటాడితే దానికి ఆహారం రెండు, మూడ్రోజులకు సరిపోతుంది. ఆ తర్వాతేæ చిరుత మళ్లీ బయటకు వస్తుంది. రక్తపు మరకలు కనిపించాయి. చిరుత పాద ముద్రలు కనిపించలేదు. ఈ రాత్రికే ట్రాక్‌ కెమెరాలను అమర్చి దాని కదలికలను పరిశీలిస్తాం.. -సాక్షితో రేంజ్‌ ఆఫీసర్‌ ప్రతిమ 

అటు పులి..
గాండ్రింపులతో పరుగులు తీసిన రైతులు
గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచనపల్లి అటవీ ప్రాంతంలో శని వారం పెద్దపులి గాండ్రింపులు వినిపించాయి. దీంతో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలు, రైతులు పరుగులు పెట్టారు. రెండ్రోజుల క్రితం జగ్గాయిగూడెం పొలాల్లోకి వచ్చిన పులి, తిరి గి కాచనపల్లి అటవీ ప్రాం తంలోకి వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రాయగూడెం గ్రామస్తులు మంచినీళ్ల కోసం వాగులోకి వెళ్లినప్పుడు పులి పాదముద్రలు కనిపించాయని తెలిపారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.   

మరిన్ని వార్తలు