మరోసారి చిరుత కలకలం  

27 Aug, 2020 08:33 IST|Sakshi
మృతి చెందిన లేగదూడను పరిశీలిస్తున్న అటవీ, పోలీసులు అధికారులు.

సాక్షి, రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌లో చిరుత మరోసారి కలకలం సృష్టించింది. లేగదూడపై దాడి చేసి, చంపేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజేంద్రనగర్‌ నుంచి హిమాయత్‌సాగర్‌ వెళ్లే మార్గంలో వాలంతరీ కార్యాలయం ఉంది. దీనికి వెనక భాగంలో కొందరు రైతులు గడ్డి పెంచి విక్రయిస్తుంటారు. షఫీ అనే వ్యక్తి స్థానికంగా ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని నాలుగు గేదెలు, నాలుగు ఆవులను పెంచుతున్నాడు.  బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కుక్కలతో పాటు గేదెలు, ఆవుల అరుపులు రావడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి చప్పుడు చేస్తూ పశువుల పాకవైపు వచ్చాడు. ఇక్కడ ఓ లేగదూడ మృతి చెంది ఉంది. వీరి అరుపులకు ఏదో ఒక జంతువు పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లినట్లు షఫీ గమనించాడు. ఈ విషయమై రాజేంద్రనగర్‌ పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తాము శబ్దం చేసుకుంటూ వచ్చిన సమయంలో.. పొదల్లోకి వెళ్లిన జంతువు చిరుతే కావచ్చని అనుమానం వ్యక్తంచేశాడు.

దీంతో ఫారెస్టు రేంజ్‌ అధికారి శ్యామ్‌కుమార్, రాజేంద్రనగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అటవీ శాఖ రేంజ్‌ అధికారి శ్యామ్‌కుమార్‌ మాట్లాడుతూ.. లేగదూడపై దాడి చేసింది చిరుతేనని స్పష్టంగా చెప్పలేమన్నారు. లేగదూడపై దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయని, దూడ శరీర భాగం తిన్నట్లు కనిపిస్తోందని స్పష్టంచేశారు. స్థానికంగా హైనాలు కూడా ఉన్నాయని, అవి కూడా దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం సాయంత్రం కెమెరాలతో పాటు బోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. దాడి చేసింది చిరుతే అయితే.. తప్పనిసరిగా ఆహారం కోసం మరోసారి వస్తుందని చెప్పారు. గతంలో యూనివర్సిటీ పైభాగంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. రెండు నెలల క్రితం గగన్‌పహాడ్‌లోని ప్రధాన రహదారిపై కనిపించిన చిరుత పక్కనే ఉన్న యూనివర్సిటీ అడవుల్లోకి వెళ్లిందని వివరించారు. స్థానికంగా మూడు సార్లు ఈ చిరుత కనిపించినా.. నెలన్నరగా ఎలాంటి కదలిక వెలుగులోకి రాలేదన్నారు.

అనంతరం బుధవారం లేగదూడపై దాడితో చిరుత కదలిక మరోసారి కనిపించింది. స్థానికుల భయాందోళన... వాలంతరీ చుట్టూ నివాస ప్రాంతాలు ఉన్నాయి. అటువైపు గాంధీనగర్, హనుమాన్‌నగర్, ఇటూవైపు కిస్మత్‌పూర్, దర్గాఖలీజ్‌ఖాన్‌ నివాస ప్రాంతాలు ఉన్నాయి. చిరుత విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిన్నమొన్నటి వరకు తాము యూనివర్సిటీ అడవుల్లో ఉందని భావించామని, ప్రస్తుతం అడవుల నుంచి నివాస ప్రాంతాల్లోకి వస్తుండడంతో ఏంజరుగుతుందోనని ఆవేదన వ్యక్తంచేశారు. గగన్‌పహాడ్‌ ప్రాంతంలో కనిపించిన వెంటనే పట్టుకుంటే తమకు ఈ బాధ తప్పేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు