‘గోల్కొండ’ నోట్‌బుక్స్‌ 

13 Mar, 2022 04:12 IST|Sakshi

లేపాక్షి నంది స్థానంలో గోల్కొండ నోట్‌బుక్స్‌ 

చర్యలు చేపట్టిన పరిశ్రమల శాఖ 

డీఈఓలకు ఆదేశాలివ్వాలని విద్యాశాఖకు విజ్ఞప్తి 

అన్ని శాఖల్లోనూ గోల్కొండ స్క్రిబ్లింగ్‌ ప్యాడ్‌లు 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: లేపాక్షి నంది నోట్‌బుక్స్‌ అంటే ఒకప్పుడు విద్యార్థుల్లో యమ క్రేజ్‌. హాస్టళ్లలోని విద్యార్థులకు ఈ నోట్‌ బుక్స్‌నే సరఫరా చేసేవారు. బయటివారు కొనుక్కోవాలంటే మాత్రం సూపర్‌బజార్‌లకు వెళ్లాల్సిందే. సాధారణ నోట్‌ బుక్‌లకంటే పెద్దసైజ్, నాణ్యత ఈ నోట్‌బుక్స్‌ సొంతం. వాటి మీద ఆసక్తితో విద్యార్థులు పట్టణాల్లోని సూపర్‌ బజార్‌లకు వెళ్లి మరీ కొనుక్కునేవారు. ఇప్పుడు ఆ నోట్‌బుక్స్‌ మళ్లీ రాబోతున్నాయి. కాకపోతే లేపాక్షి నంది బ్రాండ్‌ స్థానంలో ‘గోల్కొండ’ నోట్‌బుక్స్‌ పేరుతో వాటిని పరిశ్రమల శాఖ తీసుకొస్తోంది. 

అన్ని శాఖలకు అందుబాటులోకి...  
తెలంగాణ ట్రేడ్‌ ప్రమోషన్‌లో భాగంగా ఈ నోట్‌బుక్స్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోంది. విద్యాశాఖ పరిధిలోని గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) వీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. గోల్కొండ నోట్‌బుక్‌లను తీసుకునేలా జిల్లాల్లోని డీఈఓలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖను కోరింది. విద్యార్థులకే కాక... అన్ని శాఖల విభాగాధిపతి కార్యాలయాలు, కమిషనరేట్లు, కలెక్టరేట్లు, కార్పొరేషన్లు, బోర్డు కార్యాలయాల్లోనూ గోల్కొండ స్క్రిబ్లింగ్‌ ప్యాడ్‌లు, పేపరు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆయా శాఖల అధికారులకు పరిశ్రమల శాఖ లేఖలు కూడా రాసింది.  

సైజును బట్టి ధరలు.. 
సైజులను బట్టి ఈ నోట్‌బుక్‌ల ధరలను నిర్ణయించింది. ఏ4 సైజ్, ఏ3 సైజు తదితర తెల్ల కాగితం నాణ్యతను (70 జీఎస్‌ఎం, 75 జీఎస్‌ఎం) బట్టి ధరలను ఖరారు చేసింది. 200 పేజీల సింగిల్‌ రూల్డ్‌ (వైట్‌) నోటుబుక్‌కు సైజును బట్టి రూ.31.30గా, 100 పేజీల నోట్‌ బుక్‌ ధరను సైజును బట్టి రూ.10.29గా, రూ.17.77గా నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను గురుకుల విద్యాసంస్థల అధికారులకు పంపించింది. వాటిని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరింది.    

మరిన్ని వార్తలు