Digestive System: జీర్ణ వ్యవస్థపై అంతంతే..!

25 May, 2021 10:42 IST|Sakshi

కరోనా వైరస్‌ ప్రభావం తక్కువేనంటున్న వైద్య నిపుణులు

జీర్ణాశయ సంబంధ లక్షణాలు వచ్చినా త్వరగానే తగ్గుతాయి

తీవ్రస్థాయికి చేరుకునే అవకాశాలు తక్కువే..  

ఎక్కువగా విరేచనాలు జరిగితే డాక్టర్లను సంప్రదించాలి..

సాక్షి, హైదరాబాద్‌: శరీరంలో జీర్ణ వ్యవస్థకు కరోనా సోకినా మనకు తెలియకుండానే స్వల్ప లక్షణాలతో తగ్గిపోయే అవకాశముందని వైద్యనిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగుతూ డీ హైడ్రేషన్‌ కాకుండా చూసుకుంటే సరిపోతుందని పేర్కొంటున్నారు. నీళ్ల వీరేచనాలు ఎక్కువగా అయితే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే సమస్య తీవ్రం కాకుండా తగ్గుతుందని సూచిస్తున్నారు. 

కరోనాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా గ్యాస్ట్రో, కాలేయ సంబంధ సమస్యలు వస్తున్నా.. అవి తీవ్రస్థాయికి చేరుకునే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. కోవిడ్‌ ప్రధానంగా ఊపిరితిత్తులతో ముడిపడిందని స్పష్టమైనా కొన్ని కేసుల్లో జ్వరం, శ్వాసకోశ సంబంధిత లక్షణాల కంటే విరేచనాల సమస్యతో కరోనా బయటపడిందని వివరించారు. విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం వంటి ఉదర సంబంధ లక్షణాలతో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి సందర్భంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, కాలేయానికి సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. 

లక్షణాలు– తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 
కొందరికి ముక్కు ద్వారా తీసుకున్న నమూనాలతో కరోనా నెగెటివ్‌ వచ్చినా.. విసర్జితాల నమూనాలు పరీక్షిస్తే పాజిటివ్‌ వచి్చన అనుభవాలు ఇతర దేశాల్లో జరిగింది.  తగిన సమయంలో కరోనా వైరస్‌కు చికిత్స చేయడం ద్వారా గ్యాస్ట్రో, కాలేయ సంబంధ సమస్యలు ముదరకుండా చేయొచ్చని చెబుతున్నారు. ఈ రోగుల్లో రోగ నిరోధక శక్తి సరిగా పనిచేయకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. మద్యపానం, అనారోగ్య ఆహారపు అలవాట్లతో కాలేయ జబ్బులు ముదురుతాయి. మంచి ఆహారం, వ్యాయామంతో నివారించొచ్చు. ఉదర, కాలేయ కణాలకు కరోనా వైరస్‌ చురుగ్గా సోకడంతో పాటు పరివర్తనం చెందుతుంది. కరోనా కారణంగా జీర్ణకోశ వ్యవస్థకు, కాలేయానికి ఏమేర నష్టం చేస్తుందనే దానిపై స్పష్టత కొరవడింది.  

‘కోవిడ్‌లో సాధారణంగా ఊపిరితిత్తులు అధికంగా ప్రభావితం అవుతాయి. అదనంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్‌ ట్రాక్, కాలేయం, క్లోమం, పిత్తాశయం వంటి సమస్యలు మూడోవంతు రోగుల్లో చూస్తుంటాం. వాంతులు, ఆకలి లేకపోవడం, విరేచనాలు, ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపు నొప్పి వంటివి స్వల్ప లక్షణాలుగా వస్తాయి. కాలేయం, క్లోమం, పిత్తాశయం, చిన్నపేగుల్లో కోవిడ్‌ కారణంగా రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. కోవిడ్‌ బాధితుడు వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు బీపీ సరిగా లేకపోతే ఇచ్చే మందు లతో రక్త ప్రసరణ తగ్గే అవకాశాలుంటాయి. దుష్రభావాల కారణంగా పేగుల్లో రక్తనాళాలు బ్లాక్‌ అయ్యి పేగులు కుళ్లిపోయి గ్యాంగ్రిన్‌ వచ్చే అవకాశం ఉంది. పిత్తాశయం ఇన్‌ఫెక్షన్లు సాధారణంగా రాళ్లు ఉన్నప్పుడు వస్తుండగా, ఇప్పుడు కోవిడ్‌తో రాళ్లు లేకుండానే గాల్‌ బ్లాడర్‌లో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. 

కొలైటీస్‌ సమస్య వస్తుంది. ఒకరి విసర్జితాల ద్వారా మరొకరికి వైరస్‌ సోకే అవకాశాలున్నాయి. కానీ అది ఎంత శాతమనేది స్పష్టం కాలేదు. కోవిడ్‌ కారణంగా పాంక్రైటిస్‌ సమస్య, గాల్‌బ్లాడర్, ఇంటెస్టైన్‌లో ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. లివర్‌లో ఎంజైమ్స్‌ పెరగడం వల్ల గాయాలు అవుతాయి. కామెర్లు లేకపోయినా ఈ ఎంజైమ్స్‌ పెరుగుతాయి. మనం తీసుకునే ఆహారమే పేగుల్లో కదలికలను పెంచుతుంది. కోవిడ్‌లో ఈ పేగుల కదలిక తగ్గుతుంది. వాటిలో బ్లాక్‌లు లేకపోయినా పేగులు ఉబ్బిపోతాయి. కరోనా పేషెంట్లలో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్‌ ట్రాక్‌ సమస్యలు మూడో వంతు దాకా ఉండే అవకాశాలున్నాయి. అయితే ఇవేవీ తీవ్రతతో కూడినవి ఉండవు. విరేచనాలు, ఆకలి లేకపోవడం, రుచి లేకపోవడం వంటి స్వల్ప లక్షణాలే ఉంటాయి. రక్తనాళాలు బ్లాక్‌ అయినప్పుడే ఇది సీరియస్‌గా మారుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోతే రక్తం గడ్డకట్టే అవకాశాలుంటాయి కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. కోవిడ్‌ లక్షణాలతో పాటు రక్తం గడ్డ కడితే స్టెరాయిడ్స్‌ ఇవ్వడం మంచిది కాదు. మద్యం తీసుకునే వారికి, లివర్‌ సీరోసిస్‌ ఉన్న వారిపై కోవిడ్‌ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.’ 

– డా.ఎన్‌.బీరప్ప, ప్రొఫెసర్, 
గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి, నిమ్స్‌

మరిన్ని వార్తలు