బస్సుల కొనుగోలు, అదనపు సర్వీసులపై టీఎస్‌ఆర్టీసీ దృష్టి 

4 Nov, 2020 09:53 IST|Sakshi

తెలంగాణ–ఏపీ మధ్య మున్ముందు బస్సు సర్వీసుల పెంపుపై ఒప్పందంలో చోటు

3 నెలల తర్వాత సమీక్షకు ఇరు ఆర్టీసీ అధికారుల నిర్ణయం 

సాక్షి హైదరాబాద్‌: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా లక్ష కిలోమీటర్ల మేర తిరిగే సర్వీసులను ఏపీ తగ్గించుకుంది.. దీనివల్ల ఆర్టీసీకి వచ్చేనష్టం ఏటా దాదాపు రూ.270 కోట్లు. తెలంగాణ ఆర్టీసీ.. ఆ మొత్తాన్నితన సర్వీసులు నడపడం ద్వారా ఆదా చేసుకోగలుగుతుందా? లేదా ప్రైవేటు బస్సులు తన్నుకుపోతాయా?  కొత్తగా అదనపు బస్సులునడపడంపై తెలంగాణ ఆర్టీసీ యోచన ఏమిటి?..

ప్రస్తుతానికి ఇలా..
అంతర్రాష్ట్ర సర్వీసులకు సంబంధించి టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ మధ్య సోమవారం ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. తగ్గించుకున్న బస్సుల వల్ల ఏపీ పెద్దగా కోల్పోయేది ఏం లేదని, దుబారా తగ్గి ఖర్చు ఆదా అవుతుందన్న భావన తెలంగాణ ఆర్టీసీలో వ్యక్తమవుతోంది. అయితే, దీన్ని మరింత నిశితంగా పరిశీలించాలని రెండు సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుత ఒప్పందం ప్రకారం నడుస్తున్న సర్వీసులకుసంబంధించి మరో మూడు నెలల తర్వాత సమీక్షించుకోవాలని ఏపీ అధికారులు చేసిన ప్రతిపాదనకు తెలంగాణ అధికారులు సూత్రప్రాయంగాఅంగీకరించారు. ప్రస్తుతం భారీగా బస్సులు, అవి తిరిగే నిడివిని ఏపీఎస్‌ఆర్టీసీ తగ్గించుకున్న నేపథ్యంలో, వీలైనంత తొందరలో డిమాండ్‌ పెరుగుతుందన్న అభిప్రాయాన్ని ఏపీ అధికారులు వ్యక్తం చేశారు. ఒకవేళ బస్సులకు ప్రయాణికుల నుంచి డిమాండ్‌ పెరిగి, అందుకు అనుగుణంగా నడపలేకపోతున్నామనే భావన వ్యక్తమైతే, వెంటనే సమీక్షించాలని పేర్కొన్నారు. డిమాండ్‌కు తగ్గట్టు బస్సులు నడపకుంటే ప్రయాణికులు ప్రైవేటు బస్సులవైపు చూస్తారని, అప్పుడా ఆదాయాన్ని రెండు ఆర్టీసీలు కోల్పోయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. 

పర్యవసానం ఏమిటి..? 
ప్రస్తుతం కోవిడ్‌తో పెద్దగా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) లేనందున ఇబ్బంది ఏముండదు. కోవిడ్‌ ప్రభావం తగ్గగానే ప్రయాణికులు మునుపటిలా బస్సులెక్కు తారు. అప్పుడు ఓఆర్‌ పెరిగి బస్సులపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్‌ ముందుకొచ్చే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్టీసీలు నష్ట పోకుండా ఉండాలంటే మళ్లీ బస్సుల సంఖ్య పెంచుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు సమ్మతించారు. దీని ప్రకారం కనీసం ఆరు నెలల తర్వాత మళ్లీ బస్సుల సంఖ్య పెంచుకునే పరిస్థితి రావచ్చు. అప్పుడు రెండు ఆర్టీసీలు కొత్త ఒప్పందం దామాషా మేరకు బస్సుల సంఖ్యను పెంచుకోవాల్సి ఉంటుంది.

టీఎస్‌ఆర్టీసీ కర్తవ్యం..?
ప్రస్తుతం ఏపీకి తిప్పే సర్వీసుల సంఖ్య పెరిగినందున తెలంగాణ ఆర్టీసీ కొత్త బస్సులను నడపాల్సి వస్తుంది. ప్రస్తుతం బస్సుల కొరత ఉన్నందున డిపోల్లో స్పేర్‌గా ఉండే బస్సులను వాడనున్నారు. ఆరు నెలల తర్వాత బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కచ్చితంగా కొత్తవి కొనాల్సి వస్తుంది. ప్రస్తుతం అంత ఆర్థిక స్థోమత తెలంగాణ ఆర్టీసీకి లేనందున ప్రభుత్వం వైపు చూడాల్సిందే. కోవిడ్‌ తదనంతర పరిస్థితిలో ప్రత్యేకంగా నిధులివ్వడం ప్రభుత్వానికీ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసులను కూడా అద్దె ప్రాతిపదికన తీసుకునే యోచనలో టీఎస్‌ఆర్టీసీ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో తిరిగే జిల్లా, సిటీ సర్వీసులుగా దాదాపు 3,300 అద్దె బస్సులను వాడుతున్నారు. తొలిసారి ఏపీ–తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల కోసం కూడా అద్దె బస్సులనే తీసుకుంటే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు. 

అద్దె బస్సుకు డ్రైవర్‌ ఎవరు..??
ఇప్పటికే పెద్దసంఖ్యలో బస్సు సర్వీసులను కుదించటంతో వేలసంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్లు అదనంగా మారారు. వారికి ఇతరత్రా పనులు అప్పగిస్తున్నా.. కొందరు ఖాళీగా ఉంటున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులుగా అద్దె బస్సులు తీసుకుంటే అందులో ఎలాగూ సిబ్బంది ఉంటారు కాబట్టి ఆర్టీసీ సిబ్బందిని వాడుకునే అవకాశం ఉండదు. కూర్చోబెట్టి జీతాలివ్వాల్సిందే. వచ్చే ఏడాది పెద్దసంఖ్యలో పదవీ విరమణలున్నందున సమస్య కొంతమేర తగ్గినా ఇంకా కొందరు మిగులుతారు. ఇందుకోసం అద్దె బస్సుల్లోనూ ఆర్టీసీ డ్రైవర్లనే వాడాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అద్దె బస్సుల యజమానులే ప్రైవేటు డ్రైవర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి బదులు ఆర్టీసీ డ్రైవర్లనే వాటిల్లో వాడే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు