అయ్యో పాపం ఎంబీబీఎస్.. పెళ్లిళ్లు కావడం లేదు?

28 Mar, 2021 01:31 IST|Sakshi

అగమ్యగోచరంగా యువ వైద్యుల పరిస్థితి

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వేతనం రూ. 15 – 20 వేలే

చదువు కోసం లక్షల్లో అప్పులు... తీర్చలేక తీవ్ర నిరాశ

పీజీ లేకపోతే నో ఫ్యూచర్‌.. పీజీ సీట్లు తక్కువ... పోటీ ఎక్కువ

30 ఏళ్లు దాటినా పెళ్లి సంగతే మరిచిపోయారు

ఇతర దేశాల్లో చదివినవారి పరిస్థితి మరీ ఘోరం

వారిలో ఎంసీఐ ఫారిన్‌ ఎగ్జామ్‌లో పాసయ్యేది 14 శాతమే

పిల్లలు మెడిసిన్‌ చదువుతున్నారని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. సమాజంలో అదో ప్రత్యేక గుర్తింపు. డాక్టర్‌ అయిపోతారు కాబట్టి ఇక జీవితానికి ఢోకా లేదనే అందరూ అనుకుంటారు. కానీ వాస్తవం మరోలా ఉంది. కనీసం పీజీ లేకపోతే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంబీబీఎస్‌ ఎందుకూ కొరగాకుండా పోతోంది. నర్సులే వీరికంటే నయం. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంబీబీఎస్‌ డాక్టర్లకు రూ. 15 నుంచి 20 వేల కంటే ఎక్కువ జీతాలు ఉండటం లేదు. పీజీ సీటు రాక... ఇటు ఎంబీబీఎస్‌తో ఏమీచేయలేక, జీవితం ఎలా గడపాలో తెలియక ఎందరో యువ డాక్టర్లు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు.

ఆ విద్యార్థి పేరు సాగర్‌ (పేరు మార్చాం). అతని తండ్రి ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్‌. ఎలాగైనా ఎంబీబీఎస్‌ చదవాలన్న కోరికతో ఉన్న సాగర్, చివరకు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో సీటు సాధించాడు. 12 ఏళ్ల క్రితం బీ కేటగిరీ సీటు కోసం కొంత బ్యాంకు రుణం తీసుకున్నారు. కష్టపడి చదివి 2015లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. కొన్నాళ్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టులో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేశాడు. కానీ పీజీ చదవకపోతే ప్రయోజనం లేదనుకున్నాడు. దీంతో ఉద్యోగాన్ని వదిలేసి, ప్రస్తుతం పీజీ ఎంట్రన్స్‌కు ప్రిపేరవుతున్నాడు. కానీ బ్యాంకులో తీసుకున్న అప్పు రూ. 10 లక్షలు అలాగే ఉంది. అది చెల్లించేందుకు నానాయాతన పడాల్సి వస్తోంది.

రమేష్‌కుమార్‌... హైదరాబాద్‌లో ఉంటారు. చిరు వ్యాపారి. దిగువ మధ్య తరగతి కుటుం బం. కొడుకు యోగేంద్ర (ఇద్దరి పేర్లు మార్చాం) తెలివైన విద్యార్థి. 2012లో ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో కన్వీనర్‌ కోటా కింద సీటు వచ్చింది. అతని ప్రతిభను చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఎంతో ఆనందపడ్డారు. ఎంబీ బీఎస్‌ పూర్తయ్యాక పీజీ సీటు కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. కానీ సీటు రాలేదు. ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరితే నెలకు రూ. 15 వేల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు పెళ్లి సంబంధాలు కూడా రాలేదు. డాక్టర్‌గా మంచి పొజిషన్‌లో స్థిరపడలేకపోయాననే వేదన, ఇంకోవైపు తండ్రి ఆర్థిక పరిస్థితిని చూసి తట్టుకోలేక అవమానభారంతో 2019లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

సాక్షి, హైదరాబాద్‌: ఒంటిపై తెల్లకోటు... మెడలో స్టెతస్కోప్‌... రోగులకు వైద్య సేవలు చేస్తూ జీవితంలో స్థిరపడాలనేది అనేకమంది యువతీ యువకుల అందమైన కల. అందుకు రేయింబవళ్లు కష్టపడి ఎంబీబీఎస్‌ సాధిస్తారు. త ర్వాత అంతే శ్రద్ధతో చదివి ఎంబీబీఎస్‌ పూర్తిచేశాక అనేకమందికి మిగిలేది బ్యాంకు అప్పులే. ఆ తర్వాత పీజీ కోసం ఎన్నాళ్లు ప్రయత్నించినా రాకపోవడం, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తే 15 నుంచి 20 వేల రూపాయల జీతమే ఇస్తుండటం తో అనేకమంది యువ వైద్యులు ఎందుకు ఎంబీబీఎస్‌ చదివామా అని ఆవేదన చెందుతున్నారు. పిల్లల పరిస్థితిని చూసి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. జీవితంలో స్థిరపడక పోవడం, పెళ్లిళ్లు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 

ఎంబీబీఎస్‌ కోసం అప్పులు
పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు వస్తే సరేసరి. లేకుంటే బీ, సీ కేటగిరీలో సీటు పొందితే ఫీజులకు అప్పులే దిక్కు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలు. అంటే ఐదేళ్లకు రూ. 57.75 లక్షలు అవుతుంది. ఇక సీ కేటగిరీలో ఏడాదికి రూ. 23 లక్షల వరకు ఉంది. ఐదేళ్లకు రూ. 1.15 కోట్లు చెల్లించాలి. ఇది సాధారణ మధ్య తరగతికి తలకుమించిన భారమే. అయితే బిడ్డ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి ఈ ఫీజులను చెల్లిస్తున్నారు.

కానీ ఇంత ఖర్చు చేసి చదివాక కేవలం ఎంబీబీఎస్‌ కోర్సుతో స్థిరపడే పరిస్థితి లేకుండా పోయింది. తర్వాత పీజీ రావడం గగనంగా మారింది. దీంతో ఎంబీబీఎస్‌ డాక్టర్ల జీవితం త్రిశంకుస్వర్గంలో ఉన్నట్లుగా మారింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ప్రైవేట్‌లో కొద్దిపాటి జీతాలకు పనిచేస్తూ, స్థిరపడని వారు దాదాపు 20 వేల మంది ఉంటారని అంచనా. 
(చదవండి: ఏం పర్లేదు.. శంకర్‌దాదా ఎంబీబీఎస్ ఇక్కడ!‌)

మెడికల్‌ పీజీ సీట్లు చాలా తక్కువ...
ఎంబీబీఎస్‌ చదివాక మెడికల్‌ పీజీ, ఆ తర్వాత సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు చేయకుంటే ఇప్పుడు వైద్య రంగంలో భవిష్యత్తు లేని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులతో పాటు నైపుణ్యం ఉంటేనే లక్షల్లో జీతాలు ఇస్తారు. ఎంబీబీఎస్‌తో స్థిరపడే పరిస్థితి లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తే తప్ప... ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జీతాలు దారుణంగా ఉంటున్నాయి. అయితే పీజీ సాధించడం అంత సులువుగా లేదు. ఎందుకంటే రాష్ట్రంలో 5,140 ఎంబీబీఎస్‌ సీట్లుంటే, 1,996 పీజీ సీట్లున్నాయి.

అందులో నాన్‌ క్లినికల్‌ పీజీ సీట్లు 455 ఉన్నాయి. నాన్‌ క్లినికల్‌ సీట్లలో చాలామంది చేరడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాటితో సొంత ప్రాక్టీస్‌ చేయడానికి కానీ, ఆసుపత్రుల్లో వైద్యునిగా సేవలు చేయడానికి కానీ ఉపయోగపడవు. కేవలం అధ్యాపకులుగా పనిచేయడానికే ఉపయోగపడతాయి. అందుకే 2020–21లో ఏకంగా 170 నాన్‌ క్లినికల్‌ సీట్లు ఎవరూ చేరక మిగిలిపోయాయి. అంటే 1,541 క్లినికల్‌ పీజీ సీట్ల కోసమే ఎంబీబీఎస్‌ విద్యార్థులు పోటీపడతారు. పైగా ప్రతీ ఏడాది పీజీ కోసం పోటీ పడే ఎంబీబీఎస్‌ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీంతో పీజీ రావడం కష్టంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రతీ రెండు ఎంబీబీఎస్‌ సీట్లకు ఒక పీజీ సీటు ఉండాలన్న కేంద్ర నిర్ణయం ఆచరణ రూపం దాల్చట్లేదు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. 
 

విదేశాల్లో చదివి ఎఫ్‌ఎంజీఈ పాసయ్యేది 14 శాతమే
దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 7 వేల మంది వరకు విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. అందులో 650 మంది తెలంగాణ నుంచి వెళ్లి చదువుతున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాల అంచనా. విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసినవారు తప్పనిసరిగా ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో పాసవ్వాలి. అప్పుడే మన దేశంలో మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోగలరు.

ఎంసీఐ రిజిస్ట్రేషన్‌ ఉంటేనే సొంత ప్రాక్టీస్‌ చేసుకోవడానికి, ఎక్కడైనా పనిచేయడానికి అర్హులవుతారు. అయితే, ఇందులో పాసయ్యేవారు చాలా తక్కువగా ఉంటున్నారు. 2014–2018 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 74,202 మంది ఎఫ్‌ఎంజీఈ పరీక్ష రాస్తే, అందులో 10,400 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. అంటే కేవలం 14.01 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. 

పెళ్లిళ్లు ఎందుకు కావడం లేదు?
డాక్టరంటే ఎవరైనా అమ్మాయిని ఇస్తారని అనుకుంటారు. కానీ ఎంబీబీఎస్‌ పూర్తయి, పీజీ సీట్లు రానివారిలో చాలా మందికి పెళ్లిళ్లు కావడం లేదు. కేవలం ఎంబీబీఎస్‌తో స్థిరపడే అవకాశం లేకపోవడం వల్ల పిల్లను ఇవ్వడానికి చాలామంది ముందుకు రావడం లేదు. ఒక డాక్టర్‌ మరో డాక్టర్‌నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంటారు. ఎందుకంటే ఇద్దరూ కలిసి ఎక్కడైనా ఆసుపత్రి పెట్టుకొని నడిపించుకోవచ్చని, ఒకరు ఎక్కడికైనా వెళ్లినా మరొకరు దాన్ని చూసుకోవచ్చన్న భావన ఉంటుంది.

కానీ ఎంబీబీఎస్‌ చదువుతో మాత్రమే ఆసుపత్రి పెట్టుకొని జీవితంలో స్థిరపడే పరిస్థితులు లేనందున పెళ్లి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అంతేకాదు వేరే వృత్తుల్లో స్థిరపడిన అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు కూడా సంపాదన లేని ఎంబీబీఎస్‌ డాక్టర్లంటే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు కొందరు పీజీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్య కోర్సులు చేశాకే పెళ్లి చేసుకోవాలని ఆగిపోతున్నారు. ఇలా అనేక కారణాలతో ఎంబీబీఎస్‌ పూర్తయిన వారికి 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదని అంటున్నారు. 

ఆరేళ్ల క్రితం ఎంబీబీఎస్‌ అయిపోయింది
ఎంబీబీఎస్‌ 2015లో అయిపోయింది. అప్పటి నుంచి పీజీకి చదువుతున్నాను. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తుండటంతో పీజీకి చదవడం వీలుపడలేదు. అందుకే ఉద్యోగాన్ని వదిలేసి ప్రిపేర్‌ అవుతున్నాను. రూ. 40 వేలు పెట్టి కోచింగ్‌ తీసుకుంటున్నాను. అయితే పీజీ సీట్లు తక్కువగా ఉన్నాయి. ఎంబీబీఎస్‌ పూర్తయిన వారికి ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలు ఇస్తే చాలామంది స్థిరపడతారు. పల్లెలకు వెళ్లి పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. – డాక్టర్‌ అరుణ్, హైదరాబాద్‌

తీవ్ర ఒత్తిడిలో యువ వైద్యులు
అప్పులు చేసి ఎంబీబీఎస్‌ చదివిన వారు తర్వాత పీజీ రాక తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు. ఎంబీబీఎస్‌ పూర్తయిన వారికి కార్పొరేట్‌ ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన జీతాలు ఇవ్వడం లేదు. సొంతంగా క్లినిక్‌ పెట్టుకునే పరిస్థితి లేదు. 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లిళ్లు కావడం లేదు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలను నింపితే అనేకమందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రజలకు వైద్య సేవలు అందుతాయి.  ఎంబీబీఎస్‌ వైద్యులు కేవలం కేర్‌టేకర్ల మాదిరిగానే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పని చేస్తుంటారు. అందుకే వారి పట్ల యాజమాన్యాలు చిన్నచూపు చూస్తూ తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. గత్యంతరం లేక పనిచేయాల్సి వస్తోంది.
– డా.విజయేందర్, కన్వీనర్, తెలంగాణ డాక్టర్స్‌ ఫోరం

ఏళ్ల తరబడి చదివినా స్థిరపడలేదు
ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక నేను అనెస్థీషియా లో ఒక ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాను. అప్పులు చేసి ఫీజులు కడుతున్నాను. 29 ఏళ్లు వచ్చినా స్థిరపడలేదు. పీజీ పూర్తయినా వెంటనే స్థిరపడిపోతామన్న గ్యారంటీ లేదు. నాలాంటి వాళ్లు ఏళ్ల తరబడి వైద్య విద్య చదివి, స్థిరపడకుండా, పెళ్లి కాకుండా ఉన్నారు. నా చిన్నప్పటి క్లాస్‌మేట్స్‌ ఇంజనీరింగ్, ఐఐటీ వంటి కోర్సులు చదివి 22–23 ఏళ్లకే సంపాదిస్తున్నారు. మా నాన్న నా చదువులకు రూ.12 లక్షలు అప్పు చేశారు.
 – డా.రణధీర్‌ కుమార్, పీజీ విద్యార్థి, హైదరాబాద్‌ 
(చదవండి: పల్లెల్లో మూడేళ్లు వైద్య సేవలు
)

మరిన్ని వార్తలు