జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోత!

8 Jun, 2021 01:33 IST|Sakshi

అప్పటిలోగా ప్రాణహితలో ప్రవాహాలు పెరిగే అవకాశం

మేడిగడ్డ మొదలు.. లోయర్‌ మానేరు వరకు అన్నీ నింపే యోచన

వాటి ద్వారా నారుమళ్లకు జలాలు విడుదల

పంటలకు నీటి లభ్యత పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు 

నేటి కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం

 సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం వానాకాలం పంటలకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో అందుకు అనుగుణంగా జలాల లభ్యత పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వరి నారుమళ్లకు ఎక్కడా ఇబ్బందుల్లేకుండా బ్యారేజీలు, రిజర్వాయర్ల నుంచి కాల్వల ద్వారా నీటి విడుదలకు కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యంగా గోదావరి బేసిన్‌ పరిధిలో వరి సాగు మొదలైన నేపథ్యంలో కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నీటినందించే విషయంపై సర్కారు సమాలోచనలు చేస్తోంది. ఈ నెల మూడో వారం నుంచి ప్రాణహిత నదిలో ప్రవాహాలు మొదలుకానున్న నేపథ్యంలో జూలై నుంచి ఆయకట్టు అవసరాల మేరకు నీటిని నింపాలని భావిస్తోంది. దీనిపై మంగళవారం జరిగే కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

లభ్యత పెంచేలా ఎత్తిపోతలు
రాష్ట్రంలో గత ఏడాది వానాకాలం, యాసంగి పంటల సాగుకు గణనీయంగా నీటిని వినియోగించడంతో బ్యారేజీలు, రిజర్వాయర్లు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు వాటన్నింటినీ నింపుతూ కాల్వల ద్వారా చెరువులు నింపుతూ ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. సాధారణంగా ప్రాణహితలో జూన్‌ 15 తర్వాత ప్రవాహాలు మొదలవుతాయి. అయితే ఈ ఏడాది మరో వారం ఆలస్యంగా ప్రవాహాలు మొదలవుతాయనే అంచనా ఉంది. ఆ తర్వాత అవి పుంజుకునేందుకు మరో వారం పడుతుంది. అంటే జూలై మొదటి వారానికి ప్రవాహాలు పెరిగితే.. వచ్చిన నీటిని వచ్చినట్లు ఎత్తిపోస్తూ బ్యారేజీలు, రిజర్వాయర్లు నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీలో 16.17 టీఎంసీలకు కేవలం ఒక టీఎంసీ నీరు మాత్రమే ఉండగా, అన్నారంలో 10.87 టీఎంసీలకు 4 టీఎంసీలు, సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 4 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంది. ఈ మూడు బ్యారేజీలు నింపుతూ దిగువన ఉన్న ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌మానేరుకు జలాలను తరలించాల్సి ఉంది. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు 9.52 టీఎంసీలు, మిడ్‌మానేరులో 27.50 టీఎంసీలకు 12 టీఎంసీలు, లోయర్‌మానేరులో 24 టీఎంసీలగాను 10 టీఎంసీల లభ్యత ఉంది. వీటిలో ఎల్లప్పుడూ నీటిని నిండుగా నింపి ఉంచాలని, అవసరాలకు తగ్గట్లు ఇటు కొండపోచమ్మ సాగర్‌ వరకు అటు తుంగతుర్తి పరిధిలోని ఎస్సారెస్పీ స్టేజ్‌–2 ఆయకట్టు వరకు నీటిని పారించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో జూలైలో వచ్చే ప్రవాహాలతోనే వీటన్నింటినీ నింపనున్నారు. 


నిజాంసాగర్‌కు ప్రవాహాలు లేకపోతే..
ఇక ఇప్పటికే హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌కు నీరందించే కాల్వల పనులు పూర్తయి, ఒకదశ నీటి విడుదల సైతం జరిగింది. నిజాంసాగర్‌కు ప్రవాహాలు కరువైన పక్షంలో కొండపోచమ్మ సాగర్‌లో లభ్యతగా ఉన్న జలాలను హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌కు విడుదల చేయనున్నారు. మరోపక్క ఎస్సారెస్పీలో ప్రస్తుతం 90 టీఎంసీలకుగాను 18 టీఎంసీల లభ్యత ఉంది. ఈ నీటితో కేవలం తాగునీటి అవసరాలు మాత్రమే తీరతాయి. సాధారణంగా ఎస్సారెస్పీకి ఆగస్టు, సెప్టెంబర్‌లోనే వరదలు ఉంటాయి. అప్పుడు మాత్రమే ప్రాజెక్టు నిండుతుంది. అయితే ఈమారు ఆయకట్టుకు నీటి లభ్యత పెంచేలా ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా పంపింగ్‌ చేసి అవసరమైతే ఎస్సారెస్పీని నింపేలా ఇప్పటికే పనులన్నీ పూర్తిచేశారు. వీటికింద నీటి విడుదల ఎలా ఉండాలి, ఎప్పటినుంచి ఎత్తిపోతలు మొదలుపెట్టాలన్న దానిపై మంగళవారం కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. ఇందులో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా జలాల విడుదలపై కార్యాచరణ రూపొందించనున్నారు.  

మరిన్ని వార్తలు