మూడురోజుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ

15 Oct, 2022 02:44 IST|Sakshi

18న పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుప వనాల ఉపసంహరణ పూర్తికాగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతోపాటు బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి కూడా రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. రానున్న మూడురోజులు మెజార్టీ ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ పూర్తయ్యేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల 18న ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

రానున్న రెండ్రోజులు ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రెండ్రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణస్థితిలోనే ఉంటాయని వివరించింది.  

మరిన్ని వార్తలు