LED Light Effect On Human Health: ఎల్‌ఈడీ లైట్ల వల్ల మనకెంత ముప్పు?

26 Dec, 2021 21:19 IST|Sakshi

ఫంక్షన్లు, న్యూ ఇయర్‌ జోష్‌ పార్టీల్లో ఎల్‌ఈడీల ధగధగలు  

మెట్రో నగరాల్లో ఏటేటా పెరుగుతోన్న కాంతి కాలుష్యం 

గ్రేటర్‌ సిటీదే మొదటిస్థానం 

రెండోస్థానంలో కోల్‌కతా.. మూడోస్థానం ఢిల్లీదే 

అత్యధిక కాంతులతో మానవాళి, పశు, పక్ష్యాదులకు ముప్పు తథ్యం 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో న్యూ ఇయర్‌ జోష్‌ సంబరాలు.. ఫంక్షన్లు, ఔట్‌డోర్‌ ఈవెంట్స్‌లో జిలుగు వెలుగుల ఎల్‌ఈడీ లైట్లు...అత్యధిక కాంతిని వెదజల్లే విద్యుత్‌ దీప కాంతులు .. ధగదగల మాటెలా ఉన్నా.. వెలుగు వెనక చీకట్లు ముసురు కున్నట్లుగా గ్రేటర్‌ సిటీలో కాంతి కాలుష్య తీవ్రత రోజురోజుకూ పెరుగుతూనే ఉందని తాజా అధ్యయనంలో తేలింది. దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ నగరంలో ఈ తీవ్రత అత్యధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ అధ్యయన వివరాలు ఇటీవల ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ అనే పరిశోధన జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. 

ఈ కాంతి కాలుష్యం శృతిమించిన నేపథ్యంలో సిటీజన్లు నిద్రలేమి, స్థూలకాయం, డిప్రెషన్, చక్కెరవ్యాధి తదితర జీవనశైలి జబ్బుల బారిన పడుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనాన్ని భువనేశ్వర్‌కు చెందిన సెంచూరియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ సిబా ప్రసాద్‌ మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించారు. తన అధ్యయనంలో దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌ నగరంలో కాంతి కాలుష్య తీవ్రత అధికంగా ఉందని తేలింది. అత్యధిక కాంతిని వెదజల్లేందుకు పోటాపోటీగా ఏర్పాటుచేస్తున్న కృత్రిమ కాంతులతో అనర్థాలే అత్యధికంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 

ఇక ఈ కాంతి తీవ్రత విషయానికి వస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ఎల్‌ఈడీ విద్యుత్‌ ధగధగలు వెదజల్లుతున్న కాంతి తీవ్రత 7790 యూనిట్లుగా ఉందని తేలింది. ఈ తీవ్రతను ప్రతి చదరపు మీటరు స్థలంలో విరజిమ్మే కాంతి తీవ్రత ఆధారంగా లెక్కిస్తారు. దీన్ని ఆంగ్ల ప్రమాణంలో ‘యూనిట్‌ ఆఫ్‌ ల్యుమినస్‌ ఇంటెన్సిటీ ఫర్‌ స్కేర్‌ మీటర్‌’గా పిలుస్తారు. ఈ విషయంలో మన గ్రేటర్‌సిటీ తరవాత కోల్‌కతా నగరం రెండోస్థానంలో నిలిచింది. ఈ సిటీలో 7480 యూనిట్ల కాంతితీవ్రత ఉందని ఈ అధ్యయనం తెలిపింది. ఇక మూడోస్థానంలో నిలిచిన దేశరాజధాని ఢిల్లీ సిటీలో 7270 యూనిట్లుగా కాంతి తీవ్రత నమోదైంది. 

అతి కాంతితో అనర్థాలే... 
అత్యధికంగా కాంతిని వెదజల్లే కృత్రిమ విద్యుత్‌ దీపాలతో మానవాళితోపాటు ఇతర జీవరాశుల్లోనూ విపరీత పరిణామాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చత్వారం, కంటిచూపు దెబ్బతినడం వంటి అనర్థాలు చోటుచేసుకుంటాయంటున్నారు. చూపుల్లో అస్పష్టత చోటుచేసుకోవడం, పాదచారులు, వాహనచోదకులు, వాహనదారులు ఈ కాంతి వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించే సమయంలో కంటిచూపులో స్పష్టత కోల్పోయి తరచూ రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నట్లు ఈ అధ్యయనం హెచ్చరించింది. అత్యధిక కాలం ఎల్‌ఈడీ కాంతులను చూసేవాళ్లు సమీప భవిష్యత్‌లో రంగులను గుర్తించే విజన్‌ సామర్థ్యాన్ని సైతం కోల్పోతారని కంటి వైద్య నిపుణులు శ్రీకాంత్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఎల్‌ఈడీ లైట్లు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని చెబుతున్నప్పటికీ మానవాళికి కలిగే ముప్పును ఎవరూ గుర్తించడం లేదని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తంచేయడం గమనార్హం. 

పశు, పక్ష్యాదులకూ గడ్డుకాలమే.. 
ఎల్‌ఈడీ కృత్రిమ కాంతులు మానవాళికే కాదు పెంపుడు జంతువులు, పక్షుల జీవనశైలిని సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఈ అధ్యయనం హెచ్చరించింది. ప్రధానంగా పక్షులు సీజన్‌ను బట్టి, వాతావరణ మార్పులకు అనుగుణంగా వాటి మనుగడ కోసం ఒక చోటు నుంచి మరోచోటుకు వలసపోయే సమయంలో అత్యధిక కాంతుల బారిన పడినపుడు అవి తమ గమ్యాన్ని చేరకుండా దారితప్పుతాయని ఈ అధ్య యనం తెలిపింది. వాటి వలస టైంటేబుల్‌ సైతం అస్తవ్యస్తంగా మారుతుందని పేర్కొంది. ఇక కప్పలు సైతం ఈ అత్యధిక కాంతికి గురయినపుడు వాటి ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతాయని చెబుతున్నారు. 

గబ్బిలాలు ఈ కాంతి బారినపడినపుడు భౌతిక వత్తిడికి గురవుతాయని చెబుతున్నారు. ఈ అత్యధిక కాంతుల బారిన పడిన జంతువులు కొన్ని సార్లు కాంతిని చూసి భయపడి అధిక దూరం ప్రయాణించేందుకు బెంబేలెత్తే పరిస్థితి తలెత్తుతుందని జంతుశాస్త్ర అధ్యాపకులు చెబుతున్నారు. అత్యధిక విద్యుత్‌ కాంతులు,కృత్రిమ కాంతులు,భారీ విద్యుత్‌ దీపాలు ఏర్పాటుచేసే సమయంలో ప్రభు త్వం తగిన చర్యలు తీసుకోవాలి. 

మరిన్ని వార్తలు