పిడుగుపాటుకు ఇద్దరు తోడల్లుళ్లు మృతి  

28 Jul, 2022 01:05 IST|Sakshi
వాడుగురే సంతోష్‌, ఆదె సంతోష్‌ 

వాంకిడి (ఆసిఫాబాద్‌): సాగులో మామకు ఆసరా ఇద్దామని బుధవారం అత్తగారింటికి వచ్చిన తోడల్లుళ్లు పిడుగుపాటుకు బలైపోయారు. ఈ హృదయ విదారక సంఘటన బుధవారం కొమురంభీం జిల్లాలో జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి. వాంకిడి మండలం తేజాపూర్‌ గ్రామానికి చెందిన లోబడే రాంచందర్‌కు నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వాంకిడి మండలం కోమాటిగూడకు చెందిన వాడుగురే సంతోష్‌ (38)తో, రెండో కుమార్తెకు ఆసిఫాబాద్‌ మండలం ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన ఆదె సంతోష్‌ (36)తో వివాహం జరిపించారు.

ఇంధాని ఎక్స్‌రోడ్డు వద్ద గల తన పత్తి చేనులో యూరియా వేసేందుకు రాంచందర్‌ ఇద్దరు అల్లుళ్లను బుధవారం ఇంటికి పిలిపించుకున్నాడు. పొద్దంతా కుటుంబ సభ్యులు పొలంలోనే గడిపారు. సాయంత్రం పని ముగించుకుని తోడల్లుళ్లు వాడుగురే సంతోష్, ఆదె సంతోష్‌ ఇద్దరు ఒకే బైక్‌పై ఇంటికి బయల్దేరారు. తేజాపూర్‌ గ్రామ శివారులో వీరి బైక్‌పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. వాడుగురే సంతోష్‌కు ఇద్దరు కుమారులు, ఆదె సంతోష్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.  

మరిన్ని వార్తలు