కూలీల జీవితాల్లో పిడుగుపాటు 

21 Jun, 2022 01:20 IST|Sakshi

నలుగురు దుర్మరణం 

మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో ఘటనలు

కాగజ్‌నగర్‌/కౌటాల/ కోటపల్లి (మంచిర్యాల): వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలను పిడుగుపాటు రూపంలో మృత్యువు కబళించింది. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. కుమురంభీం జిల్లా కౌటాల మండలం వైగాం గ్రామానికి చెందిన సద్గు రే రేఖాబాయి(44) సోమవారం గ్రామ శివారు లోని ఓ రైతు చేనులో సోయాబీన్‌ విత్తనాలు విత్తేందుకు వెళ్లింది. పనులు ముగించుకుని సాయం త్రం కూలీలు రేఖాబాయి, లలితాబాయి ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలో వర్షం కురిసి పిడు గు పడింది. రేఖాబాయి అక్కడికక్కడే మృతిచెంద గా, సమీపంలోని లలితాబాయి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు భర్త సురేశ్, కూతురు ఉన్నారు. 

పెళ్లయిన రెండు నెలలకే.. 
కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం రాస్పల్లి గ్రామానికి చెందిన సుమన్‌ సోమవారం ఉదయం తన భార్య అనూష, చిన్నాన్న, చిన్నమ్మ, కూలీలతో కలిసి గ్రామ సమీపంలోని చేనులో పత్తి విత్తనాలు నాటడానికి వెళ్లాడు. సాయంత్రం పిడుగుపడటంతో సుమన్‌(28) అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్య అనూష చేతికి స్వల్ప గాయమైంది.

ప్రసాద్‌ అనే మరో వ్యక్తి స్పృహ కోల్పోయాడు. సుమన్, అనూష దంపతులకు పెళ్లయి రెండునెలలే కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో ఘటనలో ఇదే మండలంలోని అంకుసాపూర్‌ గ్రామానికి చెందిన నానాజీ(35) గ్రామ శివారులో విత్తనాలు వేసేందుకు వెళ్లి పిడుగుపడి మృతి చెందాడు. ఆయనకు భార్య నీలాబాయి, కుమారుడు సందీప్‌(10), కూతురు సం«ధ్యారాణి(8) ఉన్నారు.

పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లి.. 
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం అంకవ్వ(55) ఇదే గ్రామానికి చెందిన రైతు చేనులో సోమవారం పత్తి విత్తనాలు విత్తేందుకు వెళ్లింది. మధ్యాహ్నం భోజనం తర్వాత చేనులో విత్తనాలు విత్తేందుకు వెళ్లగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. దీంతో అంకవ్వ అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

మరిన్ని వార్తలు