హైదరాబాద్‌: మందుబాబుల జోరు.. అమ్మకాలు, ఆదాయంలోనూ అదుర్సే

12 Oct, 2021 18:16 IST|Sakshi

నగరంలో పెరిగిన మద్యం విక్రయాలు

సాధారణ స్థాయికి చేరిన వినియోగం

కోవిడ్‌ ఆంక్షలు తొలగడంతో బార్లు, రెస్టారెంట్లలో సందడి

పెరిగిన 29 శాతం మద్యం, 56 శాతం బీర్ల  అమ్మకాలు

ఇప్పటి వరకు రూ.1510 కోట్ల ఆదాయం 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. కొద్ది రోజులుగా వైన్‌షాపులు, బార్లు, రెస్టారెంట్లు కళకళలాడుతున్నాయి. కోవిడ్‌ చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో బార్లకు వెళ్లి మద్యం సేవించే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్‌ అధికారవర్గాలు అంచనా  వేస్తున్నాయి. గతంలో  కోవిడ్‌ ఆంక్షల దృష్ట్యా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. తక్కువ మోతాదులో ఇళ్ల వద్దనే వినియోగించేవారు. బార్లు తెరిచి ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్లేందుకు వెనుకడుగు వేశారు.

కానీ క్రమంగా వైరస్‌ ఉధృతి తగ్గిపోవడం, ఇంచుమించు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వినియోగం పెరిగింది. అలాగే పర్మిట్‌ రూమ్‌లు సైతం మందుబాబులతో నిండుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ 6 నెలల్లో  29 శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగినట్లు అంచనా. సర్కార్‌ ఆదాయం సైతం అదేస్థాయిలో పెరిగింది. మరోవైపు మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి, నల్గొండ మొదటి రెండు స్థానంలో నిలవగా హైదరాబాద్‌ మూడో స్థానంలో ఉంది. నగరంలో 18,25,276 కేసుల మద్యం అమ్ముడైంది. 
చదవండి: చారిత్రక వేదిక.. సరదాల వేడుక: అసదుద్దీన్‌కు కేటీఆర్‌ సూచన

56 శాతం పెరిగిన బీర్ల వినియోగం 
కోవిడ్‌ కాలంలో బీర్ల వినియోగం చాలా వరకు పడిపోయింది. అమ్మకాలు లేకపోవడంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని సైతం తగ్గించాయి. శీతల పానీయాలు, బీర్లు సేవించడం వల్ల కోవిడ్‌ సోకే అవకాశం ఉండవచ్చునన్న వార్తలతో బీర్బలులు బాటిల్‌ పక్కన పెట్టేశారు. కానీ సెప్టెంబర్‌ నుంచి బీర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే 56  శాతం వరకు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. 7,016,500  కేసుల విక్రయాలు జరిగాయి. బీర్ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఒక్కో బాటిల్‌ పైన రూ.10 వరకు తగ్గించారు. ధరల తగ్గింపు కంటే కోవిడ్‌ భయం తొలగిపోవడం వల్లనే వినియోగం  పెరిగినట్లు  ఎక్సైజ్‌ ఉన్నతాధికారి ఒకరు  తెలిపారు.  

ఆదాయంలోనూ మూడో స్థానం... 
►ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.14,320 కోట్ల అమ్మం అమ్మకాలు జరిగాయి. 
►రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఒక్క జిల్లా నుంచే రూ.3.247 కోట్ల ఆదాయం లభించింది. 
►రెండో స్థానంలో ఉన్న నల్గొండ జిల్లాలో మద్యం అమ్మకాలపైన రూ.1,599 కోట్ల ఆదాయం లభించింది.  
►ఆ తరువాత మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ మద్యం ఆదాయం రూ.1510 కోట్లు  
►దసరా అమ్మకాలతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  
చదవండి: ‘చదువు ఇష్టం లేదు.. ఆటలే ఇష్టం..ప్లీజ్‌ మాకోసం వెతకొద్దు’  

మరిన్ని వార్తలు